కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావాన్ని గుర్తించి టాలీవుడ్‌లో మొట్ట మొదట షూటింగ్‌ను ఆపేసింది మెగాస్టార్ చిరంజీవే అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మిగిలిన చిత్రబృందాలు నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే.. త్వరలోనే మళ్లీ షూటింగ్స్ షురూ కానున్నాయి. లాక్ డౌన్ తర్వాత తెలుగు సినిమాలన్నింటిలో కల్లా ముందుగా సెట్స్‌పైకి అడుగుపెట్టబోయేది మెగాస్టార్ చిరంజీవేనట. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ఈ క్రమంలో చిత్రబృందాలు తమ తమ సిబ్బందిని సిద్ధం చేసుకుంటున్నారు.
ముఖ్యంగా.. మొదట తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్ జరుపుకుంటూ ఆగిపోయిన సినిమాలు త్వరగానే సెట్స్ పైకి వెళ్లే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అంటే ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’, ‘వకీల్ సాబ్’ మాత్రమే మిగిలిన ‘పుష్ప’ లాంటి సినిమాలన్నీ బయటే షూటింగ్స్ జరుపుకుంటూ ఆగిపోయాయి. ఇంటర్ స్టేట్స్‌కు ఇప్పట్లో బస్సులు నడవడమే కష్టంగా ఉంది అలాంటిది సినిమా షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వడం అంతకంటే కష్టమే. మొత్తానికి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్ చేసుకుంటూ ఆగిపోయిన చిత్రాలు కాస్త సేఫ్ జోన్‌లోనే ఉన్నాయన్న మాట. భారీ సినిమాలకు కొద్దిరోజులు గడ్డుకాలమేనని దీన్ని బట్టి తెలుస్తోంది.
‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ను అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి 01న లేదా 05 తారీఖున సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలియవచ్చింది. ఇందుకుగాను ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ కొత్త షెడ్యూల్స్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారట. కొత్త షెడ్యూల్‌లో భాగంగా రెండు పాటలు, ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తారని సమాచారం. ఇందులో ఒకటి ఐటమ్ సాంగ్ కాగా.. ఇంకొకటి విప్లవ నేపథ్యంలో ఉంటుందట. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.