దేశమంతా లాక్డౌన్ విధించడంతో మొన్నటి వరకూ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం నాలుగవ విడత లాక్డౌన్ లో భాగంగా కొన్ని వ్యాపార సంస్థలకి మినహాయింపులు ఇచ్చారు. అయితే థియేటర్లు, సినిమా షూటింగులకి మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో సినిమా సెలెబ్రిటీలందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ సమయాన్ని వేరే పనులు చేయడానికి కేటాయిస్తున్నారు.
చాలా మంది నటీనటులు తమలోని అభిరుచిని అభివృద్ధి చేసుకుంటుండగా, మరికొంత మంది కొత్త అభిరుచులని అలవాటు చేసుకుంటున్నారు. తెలుగు సినిమాల్లో మెరిసిన రాశీ ఖన్నా ఈ లాక్డౌన్ సమయాన్ని చాలా ప్రొడక్టివ్ గా వాడుకుంటోంది. పంజాబీ రాష్ట్రం నుండి వచ్చిన రాశీకీ తెలుగు బాగా వచ్చు. ఊహాలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మొన్న వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి తన డబ్బింగ్ తానే చెప్పుకునే స్థాయికి ఎదిగింది.
అయితే అటు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు వస్తుండడంతో తమిళ భాషపై దృష్టి పెట్టింది. లాక్డౌన్ సమయంలో తమిళ భాషని నేర్చుకుంటూ బిజీగా ఉంటోంది. ఆన్ లైన్లో తమిళ భాషని నేర్చుకుంటూ రోజూ హోమ్ వర్క్ కూడా చేస్తుందట. ఈ అనుభవం చాలా కొత్తగా, చిన్నతనంలోకి వెళ్ళినట్లుగా ఉందని అంటోంది. తెలుగులో చాలా సినిమాలు చేసిన రాశీకి అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. మరి తమిళంలోనైనా మంచి అవకాశాలు తెచ్చుకుంటుందేమో చూడాలి.