ఈ మధ్య బాలీవుడ్ నిర్మాతలకి దక్షిణాది సినిమాలపై ఆసక్తి బాగా పెరిగింది. ఒకప్పుడు సొత్ ఇండియన్ సినిమాలని అంతగా పట్టించుకోని వారు ప్రస్తుతం మన సినిమాల కోసం ఎగబడుతున్నారు. ఇక్కడి చిత్రాలని హిందీలో రీమేక్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాల చిత్రపరిశ్రమల్లో నుండి మంచి సినిమాలని తీసుకుని వెళ్తున్నారు.
తాజాగా మళయాల చిత్రమైన అయ్యప్పనుం కోషియం సినిమా రీమేక్ హక్కులని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహమ్ దక్కించుకున్నాడు. పృథ్వీరాజ్, బిజు మీనన్ నటించిన ఈ సినిమా మళయాలంలో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా చూసిన జాన్ అబ్రహం చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడట. యాక్షన్, థ్రిల్ రెండూ కలగలిపి ఉన్న ఈ కథని హిందీ ఆడియన్స్ కి చూపించడానికి సిద్ధం అవుతున్నాడు.
జాన్ అబ్రహం నిర్మాణ సంస్థ అయిన జేఏ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందట. అయితే ఈ రీమేక్ లో ఏ ఏ పాత్రల్లో ఎవరు నటిస్తారనే విషయం మాత్రం ఇంకా వెల్లడి చేయలేదు. మరో విశేషం ఏమిటంటే, ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాని తెరకెక్కించే దర్శకుడి కోసం వెతుకుతోంది.