చక్రి సోదరుడు మహిత్ సంగీత సారథ్యంలో రూపొందిన కరోనా పాటను ఆవిష్కరించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు ప్రాణాలు సహితం లెక్కచేయకుండా రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలను కొనియాడుతూ ప్రముఖ గేయ రచయిత బాలాజీ రాసిన పాటకు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రముఖ గాయనీ గాయకులు మనో, టిప్పు, శ్రీకృష్ణ, సాయి చరణ్, నిహాల్, గీతామాధురి, అదర్శిని, అంజనా సౌమ్య, హరిణి, విలేజ్ సింగర్ బేబీ పాడిన ఈ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిత్ మిత్రులు ప్రభాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 10 మంది గాయనీ గాయకులు పాట పాడిన తీరు, బాలాజీ గారి రచన, మహిత్ నారాయణ్ గారి సంగీతం చాలా బాగుందని ప్రశంసించారు. పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికుల సేవలను గుర్తిస్తూ పాట రాయడం మరింత స్పూర్తినిచ్చిందని అన్నారు. ఈ పాట కోసం పని చేసిన టీమ్ మెంబెర్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
సంగీత దర్శకులు మహిత్ నారాయణ్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు చేసే సేవలకు ప్రతిఒక్కరు చేతులెత్తిమొక్కాలి. వారి గురుంచి పాట చేయడం.. ఆ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గారు లాంచ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. నా మిత్రుల సహకారంతో ఈ పాటను చెయ్యగలిగానని అన్నారు. నాకు సహకరించిన గాయనీ గాయకులకు, మిత్రులు ప్రభాకర్, రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.