కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌తో నిరు పేదలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ లాక్ డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లడానికి వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల్లో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు, యాత్రికులు, నిరుపేదలు ఇలా చాలా మంది నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఎండకు ఎదురీది మరీ కాళ్లు కాల్చుకుంటూ.. భార్య పిల్లలను ఎత్తుకుని నానా తిప్పలు పడుతూ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇలాంటి ఎన్నో విషాద, కన్నీళ్లు తెప్పించే ఘటనలను మనం సోషల్ మీడియాలో.. మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇలాంటివన్నీ చూసి చలించిపోయిన బాలీవుడ్ విలన్ సోనూసూద్ ముంబై నుంచి ఉత్తరప్రదేశ్, కర్నాటకతో పాటు పలు ప్రాంతాల వారిని ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు చేర్చి తాను సినిమాల వరకే ‘విలన్’ను.. రియల్ లైఫ్‌లో మాత్రం ‘హీరో’నే అని నిరూపించుకున్నారు.
మంచు వారబ్బాయి మంచి మనసు!
అయితే.. టాలీవుడ్‌లోనూ ఇలాంటి వారు ఒకరు కావాలని.. అసలు మన హీరోలు ఎందుకు ఇలా పెద్ద మనసు చాటుకోవట్లేదని.. ఇదివరకే ‘కమాన్.. టాలీవుడ్‌కు ఓ సోనూసూద్ కావాలి!’ అని www.cinejosh.com ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కార్మికుల గాథలు విన్న.. టీవీల్లో కళ్లారా చూసి చలించిన యంగ్ హీరో మంచు మనోజ్ తన పుట్టిన రోజున ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నుంచి ఏపీతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను వారి స్వగ్రామాలను తరలించాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్రం నుంచి అనుమతి తీసుకున్న ఆయన.. రెండు బస్సుల్లో కార్మికులను తరలించి మనోజ్ ‘మంచి మనసు’ చాటుకున్నారు. ఇవాళ కూడా ఒకట్రెండు బస్సుల్లో కార్మికులను తరలిస్తామని.. ఈ ప్రక్రియ మున్మందు కూడా కొనసాగుతుందని మనోజ్ చెప్పుకొచ్చారు. సో.. మనకూ ఓ సోనూసూద్ దొరికాడన్న మాట.
ముందుకు నడిపించండి..!
ఆ కార్మికులు ఇంటికెళ్లేదాకా కావాల్సిన ఆహార పదార్థాలు, శానిటైజర్స్, మాస్క్‌లు కూడా పంచిపెట్టింది మనోజ్ టీమ్. ఇంకా నగరంలో ఇలా ఇబ్బందులు పడుతున్న వారెవరైనా ఉన్నారా..? అని ఆరా తీసే పనిలో ఆయన టీమ్ నిమగ్నమైంది. కాగా.. ఇలాంటి సమయంలో మనోజ్‌కు అండగా ఉండి.. తలా ఓ చేయి వేయాల్సిన అవసరం టాలీవుడ్ నటీనటులకు ఎంతైనా ఉంది. వాస్తవానికి ఇలాంటి పనులు ఏ పెద్దలు చేయాల్సింది.. చిన్నవాడైనా మంచి మనసుతో మంచు వారబ్బాయ్ ముందుకొచ్చాడు. ఇదివరకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటించి మంచి మనసు చాటుకున్న మహానుభావులున్నారు.. అదే మనసుతో వలస కార్మికుల కోసం తపిస్తున్న మనోజ్‌ను ముందుకు నడిపించండి..