2020 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్‌లో ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ ముందు వరుసలో ఉంటుందని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. ‘కేజీఎఫ్’ తొలి భాగం దేశవ్యాప్తంగా ఆదరణ పొంది, విపరీతమైన అభిమానుల్ని సంపాదించుకుంది. హీరో యశ్ పర్ఫార్మెన్స్ ఆడియెన్స్‌ను ఎంతగా అలరించిందో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ అంతగా ఆకట్టుకుంది. ఇప్పుడు తొలి భాగాన్ని మించి, రెండో చాప్టర్ మరింత భారీగా తయారవుతోంది. బాలీవుడ్‌లో పేరుపొందిన యాక్టర్లయిన సంజయ్ దత్, రవీనా టాండన్ ఈ మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో లీక్ అయిన సంజయ్ దత్ ఫొటో ఈ సినిమాలోదే అనీ, ఇందులో ఆ లుక్‌తోటే ఆయన కనిపిస్తాడనీ ప్రచారంలోకి వచ్చింది.
ఆన్‌లైన్‌లో సంజయ్ దత్ ఫొటో కనిపించడం ఆలస్యం, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆ ఫొటోను విరివిగా షేర్ చేస్తూ వైరల్ చేసేశారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’లో హీరో రాకీగా యశ్ నటిస్తుండగా, మెయిన్ విలన్ అధీరా క్యారెక్టర్‌ను సంజయ్ దత్ పోషిస్తున్నాడు. పీరియడ్ ఫిల్మ్‌గా తయారవుతున్న ఇందులో భారత మాజీ ప్రధాన మంత్రి దివంగత ఇందిరా గాంధీ పాత్రలో రవీనా టాండన్ కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది.
కర్ణాటక ప్రభుత్వం సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మ్యూజిక్ కంపోజిషన్‌ను జరుపుతున్నామని ఆదివారం నిర్మాతలు వెల్లడించారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ కలిసి మ్యూజిక్ కంపోజిషన్ వర్క్‌లో ఉన్న ఫొటోను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో షేర్ చేశాడు. కాగా, అతి త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజవుతుందని వచ్చిన ప్రచారాన్ని ఖండించిన నిర్మాతలు, ఇప్పట్లో టీజర్‌ను రిలీజ్ చేయట్లేదని ప్రకటించారు. ఏదేమైనా ఈ ఏడాది అక్టోబర్‌లో ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని వాళ్లు స్పష్టం చేశారు.