ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలని ఆశపడుతున్న టైమ్ లో ఫస్ట్ లుక్ వీడియో ఉండదని ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం ప్రకటించేసింది. దీంతో ఎన్నో అంచనాలతో, మరెన్నో ఆశలతో ఎదురుచూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు. అందువల్ల వారిని శాంతి పరచడానికా అన్నట్టు ఎన్టీఆర్ తన అభిమానులకి ఒక విన్నపాన్ని తెలియజేశాడు.
అందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఫస్ట్ లుక్ కోసం మేరెంతగా ఎదురుచూశారో మాకు తెలుసు. కానీ లాక్డౌన్ కారణంగా సాంకేతిక నిపుణులందరూ కలిసి ఒకేచోట పనిచేయడం కుదరలేదు. అందువల్లే ఈ వీడియోని బయటకి తీసుకురాలేకపోయాం. ఆ వీడియో కోసం ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. అయితే ప్రస్తుతం వీడియో లేకపోయినప్పటికీ ఈ చిత్రం మిమ్మల్ని బాగా అలరిస్తుందని నాకు నమ్మకుముందని అన్నాడు.
ఇంకా లాక్డౌన్ కారణంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని, భౌతిక దూరం పాటించాలని కోరాడు. ప్రతీ సారి నా పుట్టినరోజుని జరుపుకునే మీరు, ఈ ఏడాది మాత్రం ఇంటిపట్టునే ఉండి, లాక్డౌన్ నిబంధనలని పాటిస్తూ జాగ్రత్తగా ఉండమని.. అలా ఉండడమే తనకి బహుమతి ఇచ్చినంత ఆనందం అని విన్నవించుకున్నాడు.