టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి పీటలు ఎక్కుదామనుకున్న టైమ్‌కు కరోనా దెబ్బ కొట్టింది. ఇప్పటికే ఒకట్రెండు సార్లు వాయిదా వేసుకున్న పలువురు హీరోలు అతి కొద్ది మంది మధ్యే పెళ్లి బాజాలు మోగించేసుకున్నారు. ఇటీవలే యంగ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్.. డాక్టర్ పల్లవికి మూడు ముళ్లేసి ఏడడుగులు నడిచాడు. అయితే.. నితిన్ పెళ్లి ఎప్పుడు..? దుబాయ్‌లో ఏప్రిల్- 16న వెడ్డింగ్ అనుకున్నారు కానీ కరోనా కష్టకాలంతో అది సాధ్యం కాలేదు. ఇటీవలే అటు పెళ్లి కుమార్తె కుటుంబీకులు.. ఇటు నితిన్ కుటుంబీకులు మళ్లీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది.
తాజాగా.. అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ పెళ్లి డిసెంబర్‌లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నాటికి కరోనా ఉధృతి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని.. అప్పుడయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకు చేసుకోవచ్చని ఇరు కుటుంబాలు ఓ మాట అనేసుకున్నాయట. అందుకే డిసెంబర్-15 లేదా 16న వివాహ వేడుక జరపాలని.. ఆ రెండ్రోజుల్లోనూ మంచి ముహూర్తాలే ఉన్నాయట.
అయితే.. ఇదివరకు అనుకున్న దుబాయ్ కాకుండా హైదరాబాద్‌లోని వధువు ఇంట్లోనే ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. నితిన్ కుటుంబీకులు మాత్రం తమకు సంబంధించిన ఫామ్ హౌస్‌లోనే పెళ్లి జరిపించాలని అనుకుంటున్నారట. హైదరాబాద్ అయితే సెలబ్రిటీలు, అభిమానులు కూడా వేడుకకు వచ్చేందుకు వీలుంటుందని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి చూస్తే డిసెంబర్‌లో నితిన్ తన ప్రేయసి శాలినితో ఏడడుగులు వేయనున్నాడన్న మాట. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.