ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండి హీరో లాంచ్ అవుతున్నాడంటే ఆ సినిమా పూర్తి కమర్షియల్ హంగులతో ఉంటుందని అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ అవేమీ లేకుండా పకడ్బందీ పొలిటికల్ థ్రిల్లర్ లీడర్ సినిమాతో హీరోగా లాంచ్ అయ్యి, తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న హీరో రానా దగ్గుబాటి. హీరోగా చేద్దామనే పట్టుకు కూర్చోకుండా విలక్షణంగా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నమే బాహుబలి సినిమా అవకాశం వచ్చేలా చేసింది.
ప్రభాస్ కి సరైన విలన్ గా రానా నట విశ్వరూపం చూపించాడు. భళ్లాలదేవ పాత్రలో ఆయన కనబర్చిన విలనిజం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరో పాత్ర పండాలంటే, ముందుగా విలన్ పాత్ర బాగా రావాలి. ఈ మేరకు ప్రభాస్ పాత్ర సూపర్ గా ఉందని మెచ్చుకున్న వాళ్లందరూ ఇన్ డైరెక్టుగా రానాని మెచ్చుకున్నట్టే.
అయితే మరోసారి ప్రభాస్ పాత్రని హైలైట్ చేయడానికి రానా వచ్చేస్తున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందని తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా రానా చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి ఎంతమేరకు నిజమనేది తెలియదు. కాకపోతే ఇలాంటి పుకార్లు నిజమైతే బాగుండని చాలామంది కోరుకుంటున్నారు.