తమిళ నటుడు సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్న పొన్ మగల్ వంధాల్ అనే చిత్రం డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటి నుండి తమిళనాడు థియేటర్ యాజమాన్యాలు సూర్యమీద చాలా కోపంగా ఉన్నారు. థియేటర్స్ కోసం తీసిన సినిమాని ఆన్ లైన్లో ఎలా రిలీజ్ చేస్తారంటూ ప్రశ్నించడమే కాదు, అలా రిలీజ్ చేస్తే సూర్య చిత్రాలని థియేటర్లలో రిలీజ్ కాకుండా నిషేధిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.
కేరళలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్యకి అక్కడి నుండి కూడా అలాంటి సమాధానమే వచ్చింది. ఈ దశలో సూర్య తన పంతాన్ని వీడి ఓటీటీలో రిలీజ్ చేయడంపై పునరాలోచించుకుంటాడని అనుకున్నారు. కానీ సూర్య అలా చేయలేదు. పట్టుదలతో పొన్ మగల్ వంధాల్ అనే చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకే సిద్ధం అయ్యాడు. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 29వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది. మొత్తానికి సూర్య గెలిచాడనే చెప్పాలి. అయితే భవిష్యత్తులో థియేటర్స్ ఓనర్స్ నుండి ఇబ్బందులు తలెత్తడం గ్యారెంటీ అని అంటున్నారు. మరి వాటినెలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.