కరోనా వల్ల నష్టపోయిన ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమ కూడా ఒకటి. అయితే చిత్ర పరిశ్రమ కోసం పనిచేసే రోజువారి కూలీలని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించారు. వారికి నిత్యావసర సరుకులు అందిస్తూ అండగా నిలుస్తున్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా టీవీ వారికి సాయం అందుతుందా లేదా అన్నది అనుమానమే.
చిత్ర పరిశ్రమలో రోజు వారి కూలీల లాగే వారు కూడా లాక్డౌన్ మొదలయినప్పటి నుండి చేతిలో పనిలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోజువారి పనిదొరికితే తినడానికి తిండి దొరికే వారి పరిస్థితి ఏమిటి. అలాంటి వారికి ఎంతమేరకు సాయం అందుతున్నది ఎవ్వరికీ తెలియదు. ఈ నేపథ్యంలో తెలుగు బుల్లితెరపై తిరుగులేని ఛానెల్ గా చెప్పుకునే స్టార్ మా తన వంతు సాయంగా 55లక్షల రూపాయలని ప్రకటించింది.
ఈ ఆర్థిక సాయం ఆర్టిస్టులకి, రచయితలకి, అసిస్టెంట్స్ కి, ఇంకా రోజువారి కూలీలకి ఇంకా ఇతరత్రా పనుల వారికి తలా పదివేల సాయం అందనుందట. కష్టకాలంలో అండగా నిలుస్తున్న స్టార్ మా యాజమాన్యానికి టెలివిజన్ నటీనటులు, ఇతరత్రా కళాకారులు దన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అయితే ఇతర ఛానెల్స్ కూడా ఇలాంటి సాయం అందిస్తే బాగుంటుందని భావిస్తున్నారు.