మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు టాలీవుడ్‌లో ఉన్న రేంజ్.. క్రేజే వేరు. ఎలాంటి జీరోను అయినా ఆయన చేతిలో పెడితే స్టార్ చేసేస్తాడని కొందరు గట్టిగా విశ్వసిస్తుంటారు. వాస్తవానికి అది నిజమే.. ఎందుకంటే.. ఆయన పరిచయం చేసిన హీరోలను చూసినా.. తెరకెక్కించిన చిత్రాలు చూసినా ఆ లెక్క అర్థమవుతుంది. ఇందుకు నిదర్శనమే ఆయన ఇంతవరకూ చేసిన సినిమాలు. బన్నీతో ‘అల వైకుంఠపురములో’ తెరకెక్కించి సూపర్ డూపర్ కొట్టిన మాటల మాంత్రికుడు అదే ఊపులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశాడు.
ఇదీ అసలు విషయం..
అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్టోరీ ఇదిగో ఇదేనంటూ.. టైటిల్ ఇదేనంటూ చిత్ర విచిత్రాలుగా వార్తలు వినిపించాయి. దీనిపై ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ వెలుగుచూసింది. అదేమిటంటే.. తన బెస్ట్ ఫ్రెండ్.. ఇద్దరూ కలిసి ఒకే రూమ్‌లో గడిపిన తన మిత్రుడైన కమెడియన్ కమ్ హీరో సునీల్‌ను సినిమాలో ఓ కీలక పాత్ర ఇచ్చాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే తన సినిమాల్లో.. తాను కథ రాసిన సినిమాల్లో సునీల్‌ను నటింపజేసి మంచి గుర్తింపు తెప్పించిన త్రివిక్రమ్ తాజాగా ఎన్టీఆర్ చిత్రంలోనూ ఆయనకు చోటిచ్చాడట.
కీలక పాత్ర..!
వాస్తవానికి ప్రస్తుతం సునీల్ పరిస్థితి కూడా అంతగా బాగోలేదు. అందుకే.. ఆయన కష్టాలు చూసిన ఒక మంచి మిత్రుడిగా మాంత్రికుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘అయిననూ పోయిరావలె హస్తినకే’ అని టైటిల్ అనుకుంటున్న ఈ సినిమాలో సునీల్‌కు మంచి పాత్రను సిద్ధం చేశాడట. ఇప్పటికే.. ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ రెండు చిత్రాల్లో సునీల్‌కు అవకాశం ఇచ్చినప్పటికీ అవి ఆయన స్థాయికి తగ్గ పాత్రలు కావని విమర్శలు రావడంతో ప్రత్యేక దృష్టి పెట్టి మరీ ఈసారి మాత్రం అదిరిపోయేలా ఉండేలా పాత్ర సిద్ధం చేశాడట. మొత్తానికి చూస్తే మిత్రుడ్ని మళ్లీ పైకి తీసుకురావాలని.. సినిమాల్లో బిజీ చేయాలని త్రివిక్రమ్ మాత్రం తహతహలాడుతున్నాడు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకూ సక్సెస్ అవుతాయో జస్ట్ వెయిడ్ అండ్ సీ.