కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో చిన్న సినిమా నిర్మాతల చూపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లవైపు మళ్ళింది. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో నష్టం భరించలేని నిర్మాతలు అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో వీక్షణం కూడా బాగా పెరిగింది. కాబట్టి ఇదే మంచి టైమ్ అనుకుని, సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు.
మొన్నటికి మొన్న అమృతరామమ్ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ వారు రిలీజ్ చేయాల్సింది. రెండు మూడు సార్లు విడుదల తేదీలు కూడా ప్రకటించారు. కానీ సడెన్ గా ఓటీటీకి అమ్మేసి షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సందీప్ కిషన్ నటించిన చిత్రం ఓటీటీలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ అనే సినిమాలో చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అయితే సందీప్ కిషన్ నటించిన డీకే బోస్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఏడేళ్ల క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఏవో కారణాల వల్ల విడుదలకి నోచుకోలేదు. ప్రస్తుతం ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఏడేళ్ల క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఎవరు తీసుకుంటారో చూడాలి.