సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకునేది తెర మీద కనిపించేవాళ్లే. హీరో, హీరోయిన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలా తెర మీద మనకి ఎవరైతే కనిపిస్తారో వారికే స్టార్ డమ్ వస్తుంది. అయితే వాళ్లలా కనిపించడానికి తెర వెనుక కృషి చేసినవాళ్ళెంతో మంది ఉంటారు. కానీ వాళ్లెవరూ సామాన్య జనాలకి గుర్తుండరు. దర్శకులకి కొద్ది పాటి క్రేజ్ ఉన్నా కూడా అది చాలా తక్కువ.
ఎంత స్టేటస్ వచ్చినా దర్శకులు, హీరోలని దాటిపోలేరు. అయితే అలా వెళ్లగలిగిన ఒకే ఒక్క డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి సినిమా ద్వారా అతడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో మంచి సినిమాలు వచ్చి ఉండవచ్చు. కానీ ఆ సినిమా పేర్లు గుర్తున్నంత ఈజీగా సినిమా దర్శకులు గుర్తుండరు. కానీ రాజమౌళి తీరు వేరు. అందరూ స్టార్ హీరోల సినిమాల కోసం వెయిట్ చేస్తుంటే, ఆ స్టార్ హీరోలే రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు.
దేశవ్యాప్తంగా రాజమౌళి ఫేమస్ అయినప్పటికీ, జనాల్లో ఆయనకి ఎంత క్రేజ్ ఉందో తెలిసిన సందర్భాలు తక్కువ. తాజాగా అలాంటి సందర్భం ఒకటి బయటపడింది. లాక్డౌన్ కారణంగా జనాలందరూ ఇళ్ళకే పరిమితమై పోవడంతో దూరదర్శన్ వారు రామానంద్ సాగర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణాన్ని మళ్లీ టెలీక్యాస్ట్ చేశారు. బుల్లితెర మీద వస్తున్న ఈ ఇతిహాసగాధకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ చూస్తే షాకవ్వడం ఖాయం. ఇప్పటి వరకు 77 మిలియన్ల మంది ఈ గాధని తిలకించారు.
రామానంద్ సాగర్ రామాయణాన్ని బుల్లితెర మీద వీక్షించిన ప్రేక్షకులు వెండితెర మీద రాజమౌళి దర్శకత్వంలో చూడాలనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో రాజమౌళి రామాయాణాన్ని తెరకెక్కించాలనే డిమాండ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం #RajamouliMakeRamayan టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఒక దర్శకుడి గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నారంటే బాహుబలి సినిమాతో రాజమౌళి ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడో అర్థం చేసుకోవచ్చు.