బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషికపూర్ నిన్న ఉదయం స్వర్గస్తులయ్యారు. అప్పట్లో రొమాంటిక్ హీరోగా అనిపించుకున్న రిషి కపూర్, బాల నటుడిగా తెరంగేట్రం చేసి, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. సినిమా షూటింగుల కోసం ప్రపంచమంతటా తిరిగిన రిషి కపూర్ మన గోదావరిని చూసి అబ్బురపడ్డాడట. కళా తపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరి సిరి మువ్వ(1976) సినిమాని సర్గం పేరుతో రిషి కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేశారు విశ్వనాథ్ గారు.
జయప్రద ఈ సినిమాతోనే బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్, ఊటీ తదితర ప్రాంతాలకి వెళ్ళిన చిత్ర బృందం రాజమండ్రి గోదావరి తీరానికి వచ్చిందట. ఉరకలెత్తుతున్న గోదావరి తీరప్రాంతాల్లో సర్గం సినిమా షూటింగ్ చేశారట. అప్పుడు గోదావరి నదీ అందాలని చూసిన రిషికపూర్ ఎంతో ఉత్సాహానికి గురయ్యాడట. ఈ విషయాన్ని తల్చుకుని కే విశ్వనాథ్ గారు రిషికపూర్ తో తన సినిమా జ్ఞాపకాలని నెమరువేసుకున్నాడు.