కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే. ఈ తరుణంలో నిరుపేదలు, రోజూ కూలి పని చేసుకుంటూ కాలం గడిపే కార్మికులు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ట్రస్ట్‌లు, ఫౌండేషన్‌ల యాజమాన్యాలు పెద్ద మనసు చాటుకున్నాయి. అలాంటి వాటిలో ‘అక్షయ పాత్ర’ ఫౌండేషన్ కూడా ఒకటి. హైదరాబాద్ నగర శివారులో ఉండే ఈ ఫౌండేషన్ పేదలను ఆదుకుంటూ రోజుకు 25వేల మందికి నిత్యావసర సరకులు అందిస్తూ మంచి మనసు చాటుకుంటోంది. మరోవైపు ఆహారాన్ని కూడా పేదలకు అందజేస్తోంది.
సుమ పిలుపు మేరకు..
ఇలాంటి ఫౌండేషన్‌కు తనవంతుగా విరాళం ప్రకటించిన టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ కనకాల.. మీరు కూడా మీకు తోచినంత విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చింది. గత నాలుగైదు రోజులుగా విరాళాలు సేకరిస్తున్న సుమ మొత్తం రూ. 5 లక్షలు కలెక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకూ రూ.3,91,000 వచ్చాయని యాంకరమ్మ తెలిపింది. ఇప్పటి వరకూ మొత్తం 307 మంది విరాళాలు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారని.. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపింది. ఇంకా సాయం చేయడానికి చాలా మంది ముందుకొస్తున్నారని సుమ ఈ సందర్భంగా తెలిపింది.
శతకోటి వందనాలు..
ఇవాళ ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన సుమ.. విరాళాల కోసం నేను ఇచ్చిన పిలుపునకు అభిమానులు బాగా స్పందించారని చెబుతూ కంటతడి పెట్టేసింది. అయితే ఇవి కన్నీళ్లు కాదని.. ఆనంద బాష్పాలని కళ్లు తుడుచుకుంది సుమ. ‘ఒక మనిషి ఇంకొక మనిషి కోసం నిలబడటం అనేది నిజంగా అమేజింగ్. మీరందరూ ఇచ్చిన ఈ డొనేషన్స్‌కి మీ స్పందనకు నేను ఎమోషన్ అయ్యాను. మనం మాత్రమే సంతోషంగా ఉన్నామనే కాకుండా అవతలి వాళ్లకు కూడా మనం ఏం చేయగలుగుతున్నాం అని ఆలోచించే మీ పెద్ద మనసులకు శతకోటి వందనాలు (దండం పెడుతూ)’ అని చెబుతూ సుమ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. ఈ సందర్భంగా డొనేషన్ చేసిన వారి పేర్లు కూడా లైవ్‌లోనే చదవి వినిపించింది. కష్టకాలంలో సాయం చేస్తే తప్పేం లేదు.. మన ఆస్తులేం తరిగిపోవ్.. సాయం చేయడానికి ముందుకొచ్చి.. మీ మంచి మనసును చాటుకోండి.