భారత సినీ చరిత్రలో నటుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. బాలీవుడ్ నటుడిగా ఆయన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ సినిమాకీ సుపరిచితుడే. కానీ కాలం ఆ నటుడికి ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోయింది. చేయాల్సిన పాత్రలు ఎన్నో ఉన్నా, ప్రేక్షకుల దాహం తీర్చే అవసరం ఇంకా ఉన్నా కూడా కాలం కనికరించకపోవడంతో ఆ నటుడు నెలకొరిగాడు. ఇర్ఫాన్ ఖాన్... బాలీవుడ్ సినిమా చరిత్రలో అతడి నుండి వచ్చిన సినిమాలకి ఎంతో ప్రాధాన్యం ఉంది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలు చేశాడు. విలన్ గానూ, హీరోగానూ మెప్పించాడు. ఇర్ఫాన్ ఖాన్ అన్న పేరు కనబడితే సినిమాలో ఏదో విశేషం ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించాడు. హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించాడు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న లైఫ్ ఆఫ్ పై సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ ది కీలకమైన పాత్ర. అలాగే స్టివెన్ స్పీల్ బర్గ్ సృష్టించిన జురాసిక్ పార్క్ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన జురాసిక్ వరల్డ్ సినిమాలో మెరిసాడు. ఈ రెండు సినిమాలు ఇర్ఫాన్ ఖాన్ పేరుని హాలీవుడ్ లోనూ వినిపించేలా చేశాయి.
అయితే ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా కాలానికి తలొగ్గాల్సిందే. క్యాన్సర్ తో పోరాడుతూ ఈ రోజు ఉదయం ఇర్ఫాన్ ఖాన్ తుది శ్వాస విడిచారు. భౌతికంగా ఇర్ఫాన్ ఖాన్ మన నుండి దూరం అయ్యుండచ్చు. కానీ ఆయన చేసిన సినిమాలు, సినిమాల్లోని పాత్రలు, ఆ పాత్రలని తలుచుకున్నప్పుడల్లా మనకి కలిగే గర్వం ఎప్పటికీ అలాగే ఉంటుంది. బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి పరిచయం అయిన నటులు చాలా మందే ఉండొచ్చు. కానీ అక్కడ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒకే ఒక్క నటుడు ఇర్ఫాన్ ఖాన్.