Advertisement
Google Ads BL

నాపాట ఇంతగా కదిలిస్తుందనుకోలేదు: ఆదేష్ రవి


‘ఇంట్లో ఉండండి-భద్రంగా ఉండండి’ అన్నది ఇప్పుడు ప్రపంచ నినాదం. కానీ ఇల్లే లేనివాళ్ల పరిస్థితికి, ‘ఉన్న వూరు-కన్నతల్లి’కి దూరంగా ఉండిపోయిన కోట్లాది వలస జీవులు పడుతున్న పడరాని పాట్లకు, సొంతూళ్లకు చేరుకోవడానికి వందలు-వేల కిలోమీటర్లు నడుస్తున్న వారి దీనావస్థకు అక్షర రూపం ఇవ్వడంతో పాటు.. దానిని స్వీయ స్వర రచనలో పాటగా ఈ ‘కరోనా కాలం’లోని మరో కోణాన్ని ఆవిష్కరించి ప్రశంసలు పొందుతున్నాడు ‘ఆదేష్ రవి’. ‘పిల్లాజెల్లా ఇంటికాడా ఎట్లవున్రో.. నా ముసలితల్లి ఏమివెట్టి సాదుతుందో...  ఇడిసి పెడితే.. నడిసి నేను పోతా సారూ’ అంటూ... అభాగ్య వలస జీవుల వెతలకు అద్దం పట్టిన ఈ పాట ఇప్పుడు యు ట్యూబ్‌లో వైరల్ అవుతూ.. అన్ని టీవీ ఛానల్స్‌లో ప్రసారమవుతూ-  ప్రపంచవ్యాప్తంగా గల మనసున్న తెలుగువారందరితో కంటతడి పెట్టిస్తోంది. చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ.. ‘ఎవరీ ఆదేశ్ రవి?’ అని ఆరాలు తీసేలా చేస్తూ.. పాలకుల్లోనూ పెద్ద స్థాయిలో కదలిక తీసుకొస్తున్నఈ పాటకు.. తన అక్షరాలతో రూపమిచ్చి.. తన స్వరంతోనే ప్రాణం పోసిన ‘ఆదేష్ రవి’ స్వతహా సౌండ్ ఇంజనీర్. ప్రవృత్తి రీత్యా మంచి కవి. కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, న్యాయశాస్త్రంలోనూ పట్టా పొందిన ఈ ‘జెమ్ అఫ్ ఏ పెర్సన్’ జన్మస్థలం తెలంగాణలోని జమ్మికుంట కావడం విశేషం. చిన్నప్పటినుంచి సంగీతం, సాహిత్యంతోపాటు..  సినిమా పట్ల తగని మక్కువ పెంచుకున్న ఈ విద్యాధికుడు.. సినిమా రంగ ప్రవేశం కోసం వినూత్నంగా ఆలోచించి.. అందుకోసం ‘సౌండ్ ఇంజినీరింగ్’ను ఏరికోరి ఎంచుకుని.. చెన్నైలోని ‘ఎస్.ఏ.ఇ’ (సౌండ్ ఆఫ్ ఆడియో ఇంజినీరింగ్) అనే ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్టాత్మక సంస్థలో..  15 ఏళ్ళ క్రితమే.. 4 లక్షలు వెచ్చించి ఆడియో విభాగంలో ‘డి.ఎఫ్.టి’ (డిప్లొమా ఇన్ ఫిలిం టెక్నాలజీ) చేసి.. సినిమా రంగంలోకి చాలా రాయల్‌గా... తనకు తానే ‘రెడ్ కార్పెట్’ పరుచుకున్నాడు. రమణ గోగుల, చక్రి, మిక్కి జె. మేయర్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల వద్ద తొమ్మిదేళ్లు సౌండ్ ఇంజనీర్‌గా పని చేసిన ఆదేష్ రవి.. గత అయిదేళ్లుగా సొంతంగా స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఒక సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఇక్కడ మంచి ప్రమాణాలతో, రీజనబుల్ ప్యాకేజీకి పూర్తి చేసుకోవచ్చు. 

Advertisement
CJ Advs

మన దేశంలోని లబ్ధ ప్రతిష్టులైన అందరు సింగర్స్ పాడిన వేలాది సాంగ్స్‌కు  సౌండ్ సొబగులద్ది... ఈ విభాగంలో తన కంటూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఆదేశ్ రవి.. తను స్వయంగా రాసి, పాడిన పాటకు మాత్రం అలాంటి హంగులు ఏమీ అద్దలేదు. అంతే కాదు.. స్వయంగా స్టూడియో కలిగి ఉన్నప్పటికీ.. ఇంతటి సంచలనం సృష్టిస్తూ.. రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తున్న ఈ పాటను తన సెల్ ఫోన్‌లో రికార్డ్ చేయడం గమనార్హం. ‘మట్టి మనుషుల పాటకు- సెంటు వాసన అద్దడం నాకు ఇష్టం లేకపోయింది’ అంటాడు.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని ఒంట పట్టించుకున్న ఆదేశ్ రవి.  ప్రముఖ తెరాస నేత రసమయి బాలకిషన్ నిర్మాణంలో.. సీనియర్ డైరెక్టర్ టి. ప్రభాకర్ దర్శకత్వంలో.. బిత్తిరి సత్తి టైటిల్ పాత్రలో రూపొంది....  మంచి విజయం సాధించిన ‘తుపాకి రాముడు’ చిత్రానికి డైలాగ్ రైటర్, సౌండ్ ఇంజినీర్, క్యాస్టింగ్ డైరెక్టర్, కో-డైరెక్టర్‌గా పని చేయడంతోపాటు.. అందులో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించి మెప్పించిన ఆదేష్.. ‘డాటర్ ఆఫ్ వర్మ’ చిత్రానికి సంగీతం అందించారు. పది రకాలుగా పలు ప్రయత్నాలు చేస్తే తప్ప మనం ఎందులో రాణించగలమో తెలుసుకోలేం అని ఆచరణపూర్వకంగా చెప్పి చూపిస్తున్న ఆదేష్ రవి.. లక్షలాది హృదయాలు చెమ్మగిల్లేలా చేస్తున్న తన పాట గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ స్థాయి స్పందనను నేను అస్సలు ఊహించలేదు. వలస కార్మికుల కష్టాలకు గుండె చెరువై.. రాసుకుని పాడిన పాట అది. ఎంతో ప్రసవ వేదనకు లోనై.. పేదోళ్ల కోసం పురుడు పోసుకున్న ఈ పాట.. ఇంత వైరల్ అవుతుందని కానీ.. ఇంతమంది పెద్దోళ్ల ప్రశంసలు పొందుతుందని కానీ ఊహించలేదు. ఈ బాధ అందరి హృదయాల్లోనూ ఉంది. అందుకే ఈ పాట ఇంతగా చేరువవుతోంది. పరిశ్రమ నుంచి, ప్రభుత్వం నుంచి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి వస్తున్న ఫోన్లు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని వింటుంటే.. నా జన్మ ఎంతో కొంత ధన్యం అయ్యిందనే భావన కలుగుతోంది’’ అంటున్నాడు. సినిమా మేకింగ్ లోని 24 శాఖల్లో.. పది శాఖలో పట్టు సంపాదించి.. సినిమా రంగంలో తన ప్రస్థానం జస్ట్ ఇప్పుడే మొదలైందంటున్న ఈ మల్టీ టాలెంటెడ్ జీనియస్.. భవిష్యత్తులో ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరిస్తాడో వేచి చూడాల్సిందే!!

Click Here for Song

Latest sensation AADESH RAVI Talks about his song:

<span>Iam not Expected this sensation says AADESH RAVI</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs