కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో చిత్రవిచిత్రాలుగా ఛాలెంజ్‌లు.. సోషల్ మీడియాలో లైవ్‌లు ఇస్తూ కాలం గడిపేస్తున్నారు. ఒకరు ఇంటిని శుభ్రం చేస్తూ ఇదిగో ఇలా చేయాలంటూ కొందర్ని నామినేట్ చేస్తే.. ఇంకొందరు ఇదిగో ఫలానా పని చేయండని నామినేట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలా చాలెంజింగ్‌లు నడుస్తున్నాయి.
ఇంట్లోని మహిళలతో ఇంటి పనులు చేయించకండి అంటూ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగా మగవారికి ‘బీ ద రియల్ మేన్’ అనే ఛాలెంజ్ విసిరాడు. దీంతో పలువురు నటులను నామినేట్ చేశాడు. అటు తిరిగి ఇటు తిరిగి మెగాస్టార్ చిరంజీవి దాకా వచ్చింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరు వావ్.. అనే రేంజ్‌లో చేసి చూపించారు. ఇంట్లోని పనులు చేశారు. చివరల్లో వంటింట్లోకి వెళ్లి దోశ కూడా వేసి ఔరా అనిపించారు. తన తల్లి అంజనాదేవీ కోసం ఆ దోశ చేసి చేశారు. దోశ చేస్తున్నప్పుడు పెనం మీద ఎగరేయడం.. చూసిన జనాలు, నెటిజన్లు వామ్మో చిరులో నలభీమ దాగున్నాడు బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఛాలెంజ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్, సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకులు మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు.
ఈ వీడియో చూసిన ప్రముఖ నిర్మాత పీవీపీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవి గారు.. ఏదో ఇంట్లో అంట్లు తోమ్మంటే తోముతాం.. ఇంకా గచ్చు కూడా కడగగలం.. కానీ మీరిలా స్టార్ చెఫ్‌లా నలభీమ పాకం వండుతుంటే.. మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు..!.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు.. జోక్స్ పక్కన పెడితే.. మీ నిరంతర ప్రేరణ ప్రశంసనీయం సర్’ అని పీవీపీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పీవీపీ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై మెగాస్టార్ ఇంకా రిప్లయ్ ఇవ్వలేదు. ఆయన స్పందిస్తే ఇంకా ఎలా ఉంటుందో మరి.