లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా రీలీజ్‌లు, షూటింగ్‌లు సర్వం బంద్ అయ్యాయి. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజూవారీ కూలికి పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తమ వంతుగా సాయం అందించడానికి నటీనటులు ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకూ చాలా మంది ప్రముఖులు భారీగానే విరాళాలు ప్రకటించగా.. ఇంకొందరు వారి వంతుగా సాయం అందించారు. తాజాగా కాంట్రవర్సీ కేరాఫ్ అడ్రస్, కాంట్రవర్సీ క్వీన్ పిలిపించుకునే కంగనా రనౌత్ సినీ కార్మికులకు తన వంతు సాయం ప్రకటించింది.
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (సౌత్ ఇండియన్ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్) రోజువారీ కార్మికుల కోసం రూ. 5 లక్షలు రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పీఎం కేర్స్ ఫండ్‌కు 25 లక్షల రూపాయిలు ప్రకటించగా.. తాజాగా మరో ఐదు లక్షలు సాయం చేసి దొడ్డ మనసు చాటుకుంది. అంటే మొత్తం రూ. 30 లక్షలు అన్న మాట. ఈ విరాళంతో పాటు.. ప్రస్తుతం కంగనా నటిస్తున్న తమిళ చిత్రం ‘తలైవి’ చిత్రానికి పనిచేసిన కార్మికులకు మరో ఐదు లక్షలు ఇవ్వడం శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం నగదును వారి ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా ఏర్పాట్లు చేసి కాంట్రవర్సీ క్వీన్ మంచి మనసు చాటుకుంది.
వాస్తవానికి ఏ విషయంపై అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడేస్తుంటుంది. ఈమె సోదరి రంగోలీ కూడా అంతే. అలా ఉండే కంగాను ఇవాళ పెద్ద మనసు చాటుకోవడంతో నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమిళ ప్రజలు ‘పురచ్చి తలైవి’గా పిలుచుకునే జయలలిత జీవిత నేపథ్యంలో తలైవీ అనే సినిమా రూపొందుతుండగా ఇందులో కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తున్న విషయం విదితమే.