కోవిడ్ 19 మన జీవితాలని అతలాకుతలం చేసేసింది. చైనా నుండి ప్రపంచమంతా వ్యాపించిన ఈ వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. దీని నుండి మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇళ్లలోనే ఉండి యుద్ధం చేస్తున్నా దాని వ్యాప్తి మాత్రం తగ్గట్లేదు. కరోనా వల్ల ఎన్నో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే పరిస్థితే కనిపించట్లేదు. భవిష్యత్తులో ఆహారం కోసం యుద్ధం చేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చని అంటున్నారు.
కరోనా వల్ల రోజువారి కూలీలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి సాయం చేయడానికి సమాజంలో చాలా మంది ముందుకు వస్తున్నారు. కరోనా వల్ల తినడానికి తిండి దొరక్క అవస్థలు పడుతున్న వారికి సాయం చేసేందుకు వ్యాపారవేత్తలు, సినీ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు.. ఇలా ప్రతీ ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సాయం విషయంలో చాలా ముందున్నాడు.
తన ఇంట్లో పనిచేసే వారితో పాటు, తన స్టాఫ్ కి మూడు నెలల జీతాన్ని అడ్వాన్స్ గా ఇచ్చి తన ఉదార హృదయాన్ని చాటుకున్నాడు. అదే కాదు ఇంకా చాలా రకాలుగా సాయం చేస్తూనే ఉన్నాడు. చేస్తూనే ఉంటాడట. తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోయినా సరే, ఎదుటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు అప్పు తీసుకునైనా సరే సాయం చేయడానికి రెడీగా ఉంటాడట. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దీంతో ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.