మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఏ డైరెక్టర్‌కు ఉండదు చెప్పండి.. అవకాశమిస్తే అర నిమిషంలో స్టోరీ లైన్ చెప్పి ఒప్పించి.. ఆరు నెలల్లో సినిమా ముగించేయడానికి దర్శకులు సిద్ధంగా ఉన్నారు. చిరు ఒక్క ఊ అంటే చాలు మరుక్షణమే మెగా కాంపౌండ్‌లో వాలిపోవడానికి డైరెక్టర్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. వీరిలో కుర్ర, సీనియర్ దర్శకులూ ఉన్నారు. అయితే అలా వేచి చూస్తున్న వారందరికీ మెగాస్టారే స్వయంగా బంపరాఫర్ ఇచ్చేశారు. ఎవరైతే తనతో సినిమా చేయడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారో వారందర్నీ తన ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఓ చానెల్‌కు ఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పేశారు.
ఆ ఇద్దరితో చెరో ఒక సినిమా..
‘ఆచార్య’ మూవీ తర్వాత తాను నటించబోయే సినిమాలు ఎవరెవరితో అనే విషయాన్నింటినీ ఆ ఇంటర్వ్యూలో చెప్పేశారు చిరు. ఆయన చెప్పిన మాటలతో ఇటు యువ దర్శకుల్లో.. అటు మెగాభిమానుల్లో అమితానందం నెలకొంది. ‘సాహో’ దర్శకుడు సుజిత్‌తో ‘లూసిఫర్’ చేస్తున్నానని.. ఆ తర్వాత చాలా యువదర్శకులతో కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు మనసులోని మాటన బయటపెట్టారు. మరీ ముఖ్యంగా బాబీ, మెహర్ రమేశ్‌లతో ఒక్కో సినిమా చేయాలనుకుంటున్నానని.. చిరు క్లూ ఇచ్చేశారు.
కుర్రాళ్లతోనే ఎందుకంటే..
అంతటితో ఆగని ఆయన.. ఇటీవలే తాను హరీశ్ శంకర్, సుకుమార్, పరశురామ్‌లను కూడా తన ఇంట్లో కలిశానని.. పలు విషయాలపై చర్చలు కూడా జరిగాయని చెప్పారు. కొరటాల శివతో ‘ఆచార్య’ పూర్తయిన తర్వాత తన కొత్త ప్రాజెక్టు గురించి స్వయంగా వెల్లడిస్తానన్నారు. ఈ సందర్భంగా యువ దర్శకులను చిరు ఆకాశానికెత్తేశారు. యువ దర్శకులతో పని చేస్తే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చని.. అలాగే తనను స్క్రీన్ మీద చూస్తూ పెరిగి డైరెక్టర్స్ అయిన యంగ్ జనరేషన్‌కు కొత్తగా ప్రజెంట్ చేయాలన్న తపన వారికి ఉంటుందన్నారు. అదే విధంగా తనకు కూడా వాళ్లతో, వాళ్ల కొత్త ఆలోచనలతో పని చేయడం ఇన్స్పైరింగ్‌గా ఉంటుందని మెగాస్టార్ తన మనసులోని మాటను బయటపెట్టేశారు. సో.. ఇకపై చిరు చిత్రాలన్నీ కుర్ర దర్శకులతోనే అన్న మాట. అంటే కుర్ర దర్శకులతో సినిమాలు చేసి.. యంగ్ హీరోస్‌కు పోటీ ఇస్తారన్న మాట. ఇందకెందుకు ఆలస్యం కుర్ర డైరెక్టర్స్.. కథతో రెడీ కండి మరీ..!