టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేటితో ఇరవై ఏళ్లు పూర్తయింది. ఆయన మొదటి సినిమా బద్రి సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఇదే రోజున రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు సినిమా హీరోకి ఆటిట్యూడ్ ని నేర్పింది పూరి జగన్నాథే అని చెప్పవచ్చు. పూరి సినిమాల్లో హీరోలకి ఎంత ఆటిట్యూడ్ తో ఉంటారో ఆయన రాసే మాటల ద్వారా తెలుసుకోవచ్చు.
బద్రిలో నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్ అంటూ చెప్పిన డైలాగ్ అప్పట్లో బాగా పేలింది. ఒక్క సినిమాలోనే కాదు .. ఆయన చేసే ప్రతీ సినిమాలో డైలాగ్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే పూరి, ఆయన హీరోల క్యారెక్టరైజేషన్స్ ని అలాగే తీర్చిదిద్దుతారు. దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ హన్సికని చూసి ప్రేమలో పడిపోతాడు. అదీగాక నీ శరీరాన్ని చూసే ప్రేమిస్తున్నానని చెప్తాడు.
ఒక హీరోచేత అలా చెప్పించడం పూరీకే చెల్లింది. ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. పూరి స్క్రిప్ట్ చాలా వేగంగా రాస్తాడు. అంతకన్నా వేగంగా సినిమాలు తీస్తుంటాడు. ఒక స్టార్ హీరోతో సినిమాని కేవలం అరవై రోజుల్లో తీయగలిగాడంటే పూరి వేగం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే పూరీతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఎదురుచూసేవారు. రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గతినే మార్చివేస్తే, తెలుగు హీరోకి సరికొత్త ఆటిట్యూడ్ తీసుకొచ్చిన ఘనత పూరి జగన్నాథ్ కే చెందుతుంది.