టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించాలన్నా.. రికార్డ్స్ బ్రేక్ చేయాలన్నా ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న ఒక్కడి వల్లే సాధ్యం. ఈ విషయం ఆయన తెరకెక్కించిన సినిమాలతో అక్షరాలా నిరూపితమైంది. ఈయన చేతిలో పడితే ఎలాంటి జీరో అయినా స్టార్ అయిపోతాడంతే. అలా స్టార్‌లు అయిన వారి గురించి ఇక్కడ ప్రస్తావించడం అసందర్భం.. అప్రస్తుతం. ‘బాహుబలి’ 01, 02 సినిమాలతో టాలీవుడ్ సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన జక్కన్న.. ఇప్పుడు ఆయన రికార్డ్ ఆయనే ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బద్ధలు కొట్టాలని అనుకుంటున్నాడు. ‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో ప్రభాస్ పేరు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా వినిపించింది.
అయితే.. అదే ప్రభాస్‌ను ‘RRR’తో ఎన్టీఆర్ మించిపోతాడనే టాక్ టాలీవుడ్‌లో గట్టిగా నడుస్తోంది. ఇందుకు కారణం ‘RRR’లో ఎన్టీఆర్ పాత్రేనట. భారీ మల్టీస్టారర్ కావడం అందులోనూ వారిద్దరూ స్టార్ హీరోలే కావడంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటేశాయ్. వీరిద్దరిలో ఎన్టీఆర్ పాత్రే మూవీకి ప్రాణం.. కీలకంగా మారబోతోందట. కథ మొత్తం కొమరం భీమ్ చుట్టూనే తిరుగుతందట. ఈ పాత్రతో ఎన్టీఆర్ రేంజ్ పెరగటమే కాదు.. ప్రభాస్ రేంజ్‌లో ఫాన్ ఇండియా స్టార్ అనే క్రేజ్ కూడా వస్తుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇది పాన్ ఇండియా కావడంతో కాస్త నమ్మదగ్గ విషయమే. జూనియర్ పాత్ర ఎలా ఉంటుందో మే-20న పుట్టిన రోజు వేడుకగా రిలీజ్ చేయబోయే ప్రోమోతో జక్కన్న కాస్త హింట్ ఇస్తాడట.
కాగా.. రామ్‌చరణ్ సరసన ఆలియాభట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సినిమాలో వీరందరి పాత్ర కంటే.. ఎన్టీఆర్ పాత్రే హైలైట్ కానుందనే వార్తలు విన్న అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇదే నిజమైతే ఎన్టీఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందన్న మాట. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.