టాలీవుడ్ హీరోలను మల్టీస్టారర్ మూవీస్ లో చూడాలనే కోరిక చాలామంది ఫ్యాన్స్ కి ఉంది. ఇప్పటికే మహేష్ - వెంకటేష్ లు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేస్తే.. వెంకటేష్ - పవన్ కళ్యాణ్ లు కలిసి ‘గోపాలా గోపాలా’ సినిమా చేసారు. తాజాగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు బడా హీరోలు కలిసి రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నారు. అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఫాన్స్ ఇద్దరు మాత్రమే కాదు..... ఇండియా వైడ్ గా అందరిలో ఆసక్తి ఉంది. ఇక ఎప్పటినుండి పవన్ కళ్యాణ్ - మహేష్ కాంబోలో బడా మల్టీస్టారర్ అంటూ ప్రచారం జరగడమే కానీ... ఆ కాంబో ఎప్పటికి పట్టాలెక్కుతుందో ఎవరూ చెప్పలేరు.
అయితే తాజాగా ఓ కుర్ర దర్శకుడు మహేష్ - పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ తన కల అంటున్నాడు. అతనే రాహుల్ రవీంద్రన్... చి ల సౌ సినిమాతో దర్శకుడిగా మారిన ఈ నటుడు రెండో సినిమాని కింగ్ నాగార్జున తో చేసాడు. మన్మథుడు 2 సినిమాని నాగ్ తో తెరకెక్కించి డిజాస్టర్ అందుకున్న రాహుల్ ప్రస్తుతం ఓ చిన్న సినిమాని ప్లాన్ చేస్తున్నాడు అనుకున్నారు. అయితే రాహుల్ రవీంద్రన్ రెండు సినిమాలు స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకున్నాడని... అందులో ఒకటి తమిళ బిగ్ స్టార్‌తో ప్లాన్ చేస్తున్నానని.. ఇంకోటి చి ల సౌ తరహాలో చిన్న ప్రాజెక్ట్ అని చెబుతున్నాడు రాహుల్. ఇక పవన్ - మహేష్ కాంబోలో ఓ మల్టీస్టారర్ చేయాలని అది తన డ్రీం ప్రాజెక్ట్ అంటున్నాడు రాహుల్. మహేష్ - పవన్ కాంబో అంటే.. కథ పవర్ ఫుల్ గా ఉండాలని, వీళ్ళని కలిపి సినిమా చెయ్యడం అనేది సామాన్యమైన విషయం కానప్పటికీ.. వాళ్లతో సినిమా చెయ్యాలనేది తన కోరిక అంటున్నాడు.