బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ మూవీతో ఈ బ్యూటీ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయరామ’ సినిమాలోనూ నటించి మెప్పించింది. మహేశ్‌తో చేసిన మూవీ సూపర్ డూపర్ హిట్టవ్వగా.. చెర్రీ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అవ్వడంతో తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది ఈ భామ. అయితే బాలీవుడ్‌లో ఇటు సినిమాలు.. అటు వెబ్ సిరీస్‌లతో యమా బిజీగా ఉంది.
పారితోషికంపై..!
ఆ మధ్య.. తెలుగులో ఇక నటించకూడదని.. పారితోషికం తక్కువగా ఇస్తారని ఇలా చాలా కారణాలతో టాలీవుడ్‌కు ఈ ముద్దుగుమ్మ దూరమైందనే టాక్ నడిచింది. అంతేకాదు.. ఈ మధ్య ఒకరిద్దరు స్టార్ హీరోల సరసన నటించాలని దర్శకనిర్మాతలు కోరినప్పటికీ గట్టిగానే పారితోషికం పుచ్చుకోవాలని.. అడిగినంత ఇవ్వకుంటే అస్సలే నటించనని చెప్పినట్లు వార్తలు వినిపించాయ్. దీంతో అందరూ వామ్మో రెండు సినిమాలకే ఈ రేంజ్‌లోనే అని అటు దర్శకనిర్మాతలు.. ఇటు సినిమా ప్రియులు కంగుతిన్నారు. అయితే ఇందులో నిజానిజాలెంత అనేదానిపై కియారా ఫుల్ క్లారిటీ ఇచ్చేసుకుంది.
అదంతా అవాస్తవమే..
‘తెలుగు సినిమాల్లో నటించాలని నాకు చాలానే ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తాను హిందీలో వరుసగా సినిమాల్లో నటిస్తున్నాను. బిజిబిజీగా ఉండటం వల్ల వీలుకాదని చెప్పానే తప్ప.. పారితోషికం గురించి చర్చించలేదు. బాలీవుడ్ సినిమాలతో బిజిబిజీగా ఉండటంతో తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాను. తెలుగులో కథ.. నా పాత్ర నచ్చినప్పుడే ఓకే చెప్పాలని నేను అనుకుంటున్నాను. అంతకుమించి వేరే కారణాలేమీ లేవు. పారితోషికం తక్కువైతే చేయనని నేను ఎప్పుడూ.. ఎవరితోనూ చెప్పలేదు. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుడుతున్నాయో.. ఎవరు సృష్టిస్తున్నారో అర్థం కావట్లేదు’ అని కియార్ క్లారిటీ ఇచ్చుకుంది.