సైరా తర్వాత మెగాస్టార్ వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. మళయాల సినిమా లూసిఫర్ రీమేక్ హక్కులు కొని పెట్టుకున్న చిరంజీవి, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ అధికారికంగా రాలేదు. సినిమా పేరుతో మొదలుకుని, హీరోయిన్ తప్పుకోవడం, మరో హీరోయిన్ ని ఎంచుకోవడం వంటి వార్తలన్నీ సోషల్ మీడియా ద్వారా బయటపడ్డవే.
ప్రస్తుతం అలాంటి మరో న్యూస్ బయటకి వచ్చింది. ఆచార్యలో మెగాస్టార్ పాత్ర ఎలా ఉంటుందన్న విషయమై ప్రతీ ఒక్కరికీ ఆసక్తిగా ఉంది. కొరటాల సినిమాల్లో హీరోలు సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. చిరంజీవి కుడా సమాజానికి మెసేజ్ అందించే సినిమాలని బాగా ఇష్టపడతాడు. ఈ సినిమాలోనూ చిరంజీవి సమాజ హితం కోసం పనిచేస్తాడట. నక్సలైట్ నుండి సాధారణ మనిషిగా జనజీవన స్రవంతిలో కలిసిపోయాక ప్రొఫెసర్ గా అవతారమెత్తి ప్రకృతి వనరులని కాపాడే శక్తిగా కనిపిస్తాడని అంటున్నారు.
ఈ పాత్రలో హీరోయిజంతో పాటు ఎమోషన్ పీక్స్ లో ఉంటుందట. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తో తనలో పదునేమీ తగ్గలేదని నిరూపించుకున్న మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.