టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. రంగస్థలం వచ్చిన రెండేళ్లకి బన్నీతో పుష్ప అనే సినిమాని స్టార్ట్ చేశాడు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రమిది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ, లారీడ్రైవర్ గా కనిపించనున్నాడు. లారీ డ్రైవర్ గా బన్నీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే బన్నీ లుక్ చూసిన ప్రతీ ఒక్కరూ, రంగస్థలంలో రామ్ చరణ్ లుక్ తో పోల్చారు. అయితే రంగస్థలంలో రామ్ చరణ్ కనిపించిన దానికంటే మాస్ గా కనిపించాడు బన్నీ. హీరో లుక్ ఊరమాస్ గా ఉంటుందని తెలియడంతో హీరోయిన్ పాత్ర కూడా అలాగే ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే బన్నీ లుక్ రామ్ చరణ్ ని పోలి ఉన్నట్లుగానే రష్మిక లుక్ రంగస్థలంలో సమంతని పోలి ఉంటుందని అంటున్నారు.
ఇప్పటికే పల్లెటూరి అమ్మాయిగా రష్మిక లుక్ డిజైన్ చేశారట. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక లుక్ రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలా అందంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాని ఈ సినిమా నుండి రష్మిక లుక్ ఇప్పట్లో విడుదల అయ్యే సూచన కనిపించడం లేదు.