‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా కూడా బాహుబలిని మించిపోతుందని.. భారీగానే అంచనాలున్నాయ్. అంతేకాదు ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తుండటంతో ఆ అంచనాలు కాస్త డబుల్ అయ్యాయ్. కరోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ క్రమంలో జక్కన్న ఖాళీగా ఉండటాన్ని చూసి ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు.
తాజాగా.. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా అసలు బాలీవుడ్ భామ అలియా భట్‌నే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది..? ఆ పాత్రకు సెట్ అయ్యేవారు ఎవరూ మన దగ్గర లేరా..? అలియా తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజమెంత..? అలియాకు సంబంధించిన సన్నివేశాలు ఎప్పుడు చిత్రీకరిస్తారు..? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటన్నింటికీ సూటిగా సుత్తి లేకుండా మూడే మూడు ముక్కల్లో జక్కన్న సమాధానమిచ్చేశాడు.
ఆలియాను తీసుకోవడం వెనుక..!
‘RRR చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ప్రతిభావంతుల మధ్య వారికి దీటుగా నిలిచే నటి కావాలనుకున్నాం. అయితే కొన్ని రోజులు పాటు అలాంటి వారు ఎవరు దొరుకుతారా అని చూశాం. చివరికి అమాయకంగా ఉంటూనే.. తెగువ ప్రదర్శించగల అమ్మాయి అలియా భట్ సరిపోతుందని భావించి తీసుకున్నాం. లాక్‌డౌన్ లేకుంటే అలియాకు సంబంధించిన సన్నివేశాలే చిత్రీకరించాల్సి ఉంది. లాక్‌డౌన్‌తో రీ షెడ్యూల్ చేసుకున్నాం. అలియాతో పనిచేసేందుకు సినిమా యూనిట్ ఎంతగానో ఎదురుచూస్తోంది’ అని జక్కన్న చెప్పుకొచ్చాడు. మొత్తానికి చూస్తే అలియా విషయంలో నెలకొన్న అన్ని సందేహాలకు రాజమౌళి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడన్న మాట.