త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిందో అందరికీ తెలిసిందే. నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. అయితే ఈ సినిమా ఇంతలా సక్సెస్ అవడానికి థమన్ అందించిన మ్యూజిక్ కూడా ఓ కారణమే. సినిమా కంటే ముందే విడుదల అయిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
సామజవరగమనా మొదలుకుని, బుట్టబొమ్మా, రాములో రాములా వరకు ప్రతీ పాటా సూపర్ హిట్టే. సినిమా రిలీజ్ అయ్యాక విడుదల చేసిన శ్రీకాకుళం జానపదం సిత్తరాల సిరపడు పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలు యూట్యూబ్ ని షేక్ చేశాయి. ఇప్పటివరకు వందకోట్ల మంది ఈ పాటలని విన్నారు. తాజాగా ఈ విషయం గురించి ట్వీట్ చేసిన అల్లు అర్జున్ థమన్ కి థ్యాంక్స్ చెప్పాడు.
అల వైకుంఠపురములో షూటింగ్ మొదలెట్టినపుడు అల్లు అర్జున్, థమన్ ని వందకోట్ల వ్యూస్ వచ్చే పాటలని ఇవ్వమని కోరాడట. దానికి థమన్, ఖచ్చితంగా అలాంటి పాటలే చేస్తానని మాటిచ్చాడట. ఇప్పుడు థమన్ ఇచ్చిన మాట నెరవేరడంతో బన్నీ కృతజ్ఞతలు తెలియజేశాడు. దానికి థమన్ ఈ మాటని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని బదులిచ్చాడు.