కోవిడ్19 పై యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బందికి నటుడు సోనూ సూద్ హోటల్‌లో ఉచితంగా బస ఏర్పాటు.
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్, టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సోనూసూద్ తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా వైరస్ పై పోరాటంలో విశేష కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ముంబైలోని తన హోటల్‌ను ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. సిబ్బంది తన హోటల్లో ఉండొచ్చని చెప్పాడు. ఈ విషయాన్ని ఇప్పటికే ముంబై మున్సిపల్ అధికారులకు, ప్రభుత్వ ప్రవేట్ హాస్పటిల్స్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించాడు.
కరోనాపై పోరాడుతున్న వారికి సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు సోనూసూద్ తెలిపాడు. ‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోజంతా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి చిన్న సాయం చేసే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. వాళ్లంతా ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోటు కావాలి. అందుకు మా హోటల్‌ను వినియోగించుకోవాలని మున్సిపల్, ప్రైవేట్ ఆసుపత్రులకు తెలిపాము’ అని సోనూసూద్ పేర్కొన్నాడు. కాగా, ముంబై లోని జుహూ ప్రాంతంలో హోటల్ శక్తి సాగర్‌లో సోనూసూద్ కుటుంబానికి ఆరంతస్తుల హోటల్ వుంది.
కరోనా మహమ్మారిపై యుద్ధానికి తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేసిన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్
కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తన వంతు భాగస్వామ్యం అందించడానికి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు చాంబర్ ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్‌ను కలిసి రూ. 25 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ పి. రామ్మోహన్ రావు, చాంబర్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రావు, ప్రధాన కార్యదర్శి సునీల్ నారంగ్, అభిషేక్ నామా పాల్గొన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిరళ కృషిని వారు ప్రశంసించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ప్రభుత్వానికీ, పోలీసులకు సహకరించాలనీ, ఎవరిళ్లల్లో వారు సురక్షితంగా ఉంటూ కరోనా వ్యాప్తి చెందకుండా తమ వంతు పాత్ర పోషించాలని వారు కోరారు.
తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.
కరోనా వ్యాధి వ్యాప్తి మరియు నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు భాగస్వామ్యం అందించడానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు విరాళంగా కొన్ని రోజుల క్రితం సంస్థ తరపున నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్ ప్రకటించారు. ఆ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు శుక్రవారం మంత్రి కేటీఆర్ ను కలిసి రూ. 10 లక్షల చెక్కును అందజేశారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఆర్థిక సహాయం అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాస్
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం స్తంభించి పోయింది. చిత్ర పరిశ్రమలో పనులు కూడా ఆగిపోయాయి. దీనితో చాలా మంది నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు తనవంతుగా నిర్మాతల మండలికి ఆపన్న హస్తం అందించేందుకు సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముందుకు వచ్చారు. ఆయన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి రూ 10,11,111 విరాళం అందించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతల కోసం ఈ మొత్తం ఉపయోగించాలని కోరారు. అవసరమైతే మరోసారి కూడా తాను సాయం చేస్తానని తెలిపారు. నిర్మాత చెదలవాడ శ్రీనివాస్ ఈ డబ్బును నిర్మాతలు తుమ్మల ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్లకు అందజేశారు.