టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ (56) పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను భాగ్యనగరంలోని సోమాజీగూడ యశోదా ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు వైద్యం చేయిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై నర్సింగ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లారు జామునుంచి ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యులు మాత్రం పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన కోమాలో ఉన్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అసలేం జరిగింది..? అనే విషయాలు తెలియరాలేదు కానీ ఆయన సన్నిహితులు ద్వారా మాత్రం కొన్ని విషయాలు తెలిశాయని వెబ్‌సైట్లు రాసేస్తున్నాయి.
తలకు గాయం ఎలా అయ్యింది!?
అందుతున్న సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున నర్సింగ్ మేడ పైనుంచి కిందికి దిగుతుండగా జారి ఒక్కసారిగా పడిపోయాడని తెలుస్తోంది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అయ్యిందని సమాచారం. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంట్లోని వాహనంలో యశోదా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స కావడంతో వెంటనే అడ్మిట్ చేసుకున్న వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు మీడియాకు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు, బంధువులు, తోటి సినీ నటులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నర్సింగ్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.
తనకంటూ ఓ గుర్తింపు..
కాగా.. నర్సింగ్ యాదవ్ సుమారు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన శైలిలో నటించి మెప్పస్తున్నారు. ఆయన జూనియర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయనిర్మల దర్శక నిర్మాతగా వ్యవహరించిన ‘హేమాహేమీలు’ చిత్రంతో వెండితెరకి పరిచయం అయిన ఆయన.. తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 300 చిత్రాలకు పైగా నటించారు. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) సినిమా ‘క్షణం క్షణం’లో నర్సింగ్ చేసిన పాత్రకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో సైతం అవకాశాలు గట్టిగానే వచ్చాయ్.