కరోనా కల్లోలం రోజు రోజుకీ విజృంభిస్తున్న సమయాన ప్రజలందరిలో భయాందోళనలు అధికమవుతున్నాయి. కరోనా కారణంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ పాటించాలన్న నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నా కూడా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో లాక్ డౌన్ ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఒకవైపు కరోనా కేసులు ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు ఫేక్ న్యూసెస్ మరింత చిరాకుని కలిగిస్తున్నాయి. బాలీవుడ్ నటి షెఫాలీ షా కరోనా బారిన పడిందన్న ఫేక్ న్యూస్ బయటకి వచ్చింది. అయితే ఆ ఫేక్ న్యూస్ ఆమెకి మంచే చేసిందట. షెఫాలీ షా ఫేస్ బుక్ అకౌంట్ ని హ్యాక్ చేసిన దుండగులు ఆమెకి కరోనా సోకిందని ప్రకటించారు. ఆ వార్త ఆమె అధికారిక ఖాతా నుండి రావడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. దాంతో ఆమెకి ఫోన్ చేసి అధైర్యపడవద్దని, ఏమైనా కావాలంటే కాల్ చేయమని మెసేజ్ పెట్టారట.
దాంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన షెఫాలీ తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని తెలుసుకుని, తనకేమీ జరగలేదని, తాను తన కుటుంబంతో ఆనందంగా ఉన్నానని తెలిపింది. అయితే ఈ వార్త వల్ల తన శ్రేయస్సుని కోరుకునే వారు ఎంతమంది ఉన్నారో తెలిసిందని, తనకేమీ కాకూడదని కోరుకున్న అభిమానులు ఉన్నందుకు గర్వంగా ఉందని చెప్పింది.