ప్రముఖ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి కష్టాల్లో ఉన్నవారికి తనకు తోచినంతగా సాయం చేస్తుంటాడు. టీవీల్లో, పేపర్లలో వార్తలు చూసి మరీ ఆయన స్పందించి.. సాయం చేసిన రోజులున్నాయంటే ఆయన మనసేంటో అర్థం చేస్కోవచ్చు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తుండటంతో.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో నిరుపేదలు, బస్తీవాసులు, మరీ ముఖ్యంగా సినీ రంగంలోకి రోజువారి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు, ప్రముఖులు తమకు తమ వంతుగా సాయం చేస్తూ.. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు..టాలీవుడ్‌లో ఏర్పాటు చేసిన ‘సీసీసీ’కి విరాళాలు ప్రకటిస్తున్నారు.
అయితే.. ఈ తరుణంలో పోసాని కూడా ‘నేను సైతం’ అంటూ ముందుకొచ్చి తన వంతు బాధ్యతగా 50 పేద కుటుంబాలకు సాయం చేస్తానని ప్రకటించారు. ప్రకటనే కాదు.. ఈ పేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడే నిత్యావసర సరకులను అందజేశారు. పోసాని చేసిన ఈ సాయంతో ఆ కుటుంబాల్లో చిరునవ్వులు విరిశాయి. పోసాని చేసిన ఈ సాయాన్ని నెటిజన్లు, సినీ ప్రియులు ప్రశంసిస్తున్నారు.
నిజంగా మీరు గ్రేట్ సార్.. నిన్న మొన్నటి వరకూ మీరెందుకు ఇంకా స్పందించలేదా..? అని అనుకున్నాం.. మాటల్లోనే మీ వంతుగా ఇలా సాయం ప్రకటించడం ఆనందంగా ఉందని పోసాని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖుల సొంతూళ్లలో కూడా చాలా వరకు జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద మనసుతో కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకుంటే మంచిదని పెద్దలు ఆకాంక్షిస్తున్నారు.