స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అటు సంక్రాంతి విన్నర్.. ఇటు నాన్ ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బద్దలు కొట్టేసింది. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది. వాస్తవానికి తెలుగులో హిట్టయిన సినిమాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులు ముఖ్యంగా కరణ్ జోహర్ లాంటి వారు ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే తెలుగులో సూపర్ డూపర్ హిట్టయిన చిత్రాలను రీమేక్ చేసుకొని గట్టిగానే సంపాదించేసుకున్నారు.
తాజాగా.. ‘అల వైకుంఠపురములో..’ సినిమాకు సంబంధించి రీమేక్ రైట్స్‌ను బాలీవుడ్ మేకర్ అశ్విన్ వర్దే కొనేశారట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రూ. 10 కోట్లతో రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. రీమేక్ చేస్తున్నారు సరే.. రైట్స్ కూడా కొనేశారు సరే.. హీరో ఎవరు..? హీరోయిన్ ఎవరు..? ఎవర్ని హీరోగా తీసుకుంటే బాగుంటుందని ఆలోచించిన ఆయన.. ఫైనల్‌గా స్టార్ హీరోను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఆ స్టార్ హీరో మరెవరో కాదండోయ్.. అక్షయ్ కుమార్ అని టాక్. ఇప్పటికే సంప్రదించగా.. సినిమా గురించి నిశితంగా వివరాలు అడిగి తెలుసుకున్నాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కండలవీరుడు సల్మాన్ ఖాన్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. కరోనా హడావుడి అనంతరం అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.