కోవిడ్ 19 కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి ఒకలాంటి స్తబ్దత ఆవరించింది. గతంలో మునుపెన్నడూ చూడని విధంగా భవిష్యత్తులో మరెప్పుడూ చూడాలనుకోకూడదని కోరుకునే విధంగా ప్రస్తుత పరిస్థితి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఉత్పత్తి ఆగిపోవడంతో పరిశ్రమలకి తీవ్ర నష్టం వాటిల్లనుంది. అలా కరోనా వల్ల నష్టపోతున్న పరిశ్రమల్లో చిత్ర పరిశ్రమ కూడా ఒకటి.
లాక్ డౌన్ వల్ల షూటింగులన్ని క్యాన్సిల్ అయిపోయాయి. థియేటర్లు మూసివేయడంతో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. లాక్ డౌన్ ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఒకవేళ లాక్ డౌన్ పూర్తయినా కూడా థియేటర్లకి జనాలు వస్తారో లేదో తెలియదు. ఎన్నో డబ్బులు పెట్టి తీసిన సినిమాని నష్టాల్లో రిలీజ్ చేయాలని అనుకోరు. కాబట్టి ఇదంతా చూస్తుంటే ఒకటే పరిష్కారంగా కనిపిస్తుంది.
సినిమాలు రిలీజై డబ్బులు సంపాదించుకోవాలంటే హీరోల నుండి టెక్నీషియన్ల వరకి తమ పారితోషికాలని తగ్గించే పరిస్థితి ఉంటుంది. బ్యాంకుల నుండి లోన్ గా తెచ్చిన డబ్బంతా సినిమాపై పెట్టేయడంతో లాక్ డౌన్ కారణంగా వడ్డీలు పెరిగిపోవడంతో నిర్మాతలకి ఇబ్బందులు తప్పవు. అన్నీ కుదురుకుని థియేటర్లకి ప్రేక్షకులు ఎలాంటి సందేహం లేకుండా రావాలంటే చాలా సమయం పట్టేలా ఉంది. అందువల్ల రెమ్యునరేషన్లు తగ్గించి సినిమాలని విడుదల చేస్తే లాభాలు అందుకునే అవకాశం ఉంటుంది.