కనిపించని కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలని కబలించి వేస్తోన్న ఈ సమయంలో ఆర్థికంగా చితికిపోతున్నాం. ఎప్పటి నుండో కూడబెట్టుకున్న డబ్బులని మెల్ల మెల్లగా కరిగించి వేస్తుంది. సామాన్యుల నుండి ధనవంతుల వరకూ ప్రతీ ఒక్కరూ కష్టపడుతున్నారు. అయితే సామాన్యుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రోజువారి కూలీలు, రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకుల జీవితాల్లో కరోనా చీకటిని కమ్మేస్తుంది.
అయితే ఆ చీకటిని తమ దరికి రాకుండా ఉండడానికి సాయం చేస్తున్నారు మనదేశ ధనవంతులు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా సెలెబ్రిటీలు ఇలా ప్రతీ ఒక్కరూ సామాన్య బ్రతుకుల జీవితాల్లో వెలుగు నింపడానికి చూస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు విష్ణు కలిసి 8 గ్రామాలని దత్తత తీసుకుని, ఈ కష్టకాలంలో వారికి అండగా నిలుస్తున్నారు.
కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకు ఆ గ్రామాలని ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అంతే కాదు మాస్కులు, శానిటైజర్లతో పాటు కరోనా బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు. మొత్తానికి మంచు వారు మహా మంచివారే..