అభ్యుదయ చిత్రాల దర్శకుడిగా ప్రఖ్యాతి చెందిన దివంగత టి. కృష్ణ తనయుడిగా చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టి, ఆశాభంగం చెంది, విలన్‌గా మారి అనూహ్యంగా రాణించి, తిరిగి హీరోగా రెండోసారి అవరతామెత్తి విజయం సాధించిన గోపీచంద్.. ఇవాళ ఇండస్ట్రీలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తోన్న తాజా చిత్రం ‘సీటీమార్’తో తిరిగి విజయాల బాటలోకి అడుగు పెడతాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రంలో గోపీ సరసన తొలిసారి మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా, ‘హిప్పీ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, ఇటీవల ‘వలయం’ సినిమాలో కనిపించిన దిగంగన సూర్యవంశీ సెకండ్ హీరోయిన్‌గా చేస్తోంది. మూడేళ్ల క్రితం ‘గౌతమ్ నందా’ సినిమాలో గోపీచంద్‌ను హీరోగా, విలన్‌గా డ్యూయల్ రోల్ చేయించిన సంపత్ నంది, ఈసారి ఎలాగైనా గోపీకి హిట్టివ్వడంతో పాటు డైరెక్టర్‌గా తనేమిటో ప్రూవ్ చేసుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు.
19 సంవత్సరాల క్రితం.. అంటే, 2001లో ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ‘తొలివలపు’తో హీరోగా అడుగుపెట్టాడు గోపీచంద్. ఆ సినిమా ఆడకపోవడంతో వెంటనే హీరోగా మరో అవకాశం రాలేదు. దాంతో తేజ ఇచ్చిన విలన్ అవకాశాన్ని అందిపుచ్చుకొని ‘జయం’, ‘నిజం’ సినిమాలు, ప్రభాస్ సినిమా ‘వర్షం’ చేశాడు. వాటిలో గొప్పగా రాణించడంతో ప్రేక్షకుల్లో మంచి పేరు వచ్చింది. అప్పుడు టి. కృష్ణ స్నేహితుడు, నిర్మాత పోకూరి బాబూరావు మరోసారి గోపీని హీరోగా చూపిస్తూ ‘యజ్ఞం’తో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అది హిట్టవడంతో కొంత కాలం దాకా గోపీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఆంధ్రుడు, రణం, ఒక్కడున్నాడు, లక్ష్యం, శౌర్యం, గోలీమార్, సాహసం, లౌక్యం, జిల్.. సినిమాలతో గోపీ కెరీర్ బాగానే సాగింది. ‘సౌఖ్యం’ నుంచి గోపీకి బ్యాడ్ పీరియడ్ మొదలైంది. ‘గౌతమ్ నందా’, ‘ఆక్సిజన్’, ‘చాణక్య’ సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి. బి. గోపాల్ డైరెక్ట్ చేసిన ‘ఆరడుగుల బుల్లెట్’ అయితే విడుదలకే నోచుకోలేదు. 25వ సినిమాగా చేసిన ‘పంతం’ కూడా బిలో యావరేజ్‌గానే నడిచింది.
ఇలాంటి నేపథ్యంతో ఇప్పుడు ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు గోపీచంద్. మరోవైపు ‘గౌతమ్ నందా’ మూవీ తర్వాత సంపత్ నంది మరే సినిమా చేయలేదు. టాప్ హీరోలెవరూ అతనితో సినిమా చేయడానికి ముందుకు రాకపోవడంతో మరోసారి గోపీనే నమ్ముకొని పట్టుదలతో ‘సీటీమార్’ తీస్తున్నాడు. పదేళ్ల క్రితమే.. అంటే, 2010లోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన సంపత్ ఇంతదాకా డైరెక్ట్ చేసింది కేవలం నాలుగు సినిమాలే. ‘సీటీమార్’ ఐదో సినిమా. కెరీర్‌లో వరుసగా ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ వంటి వరుస హిట్లు ఇచ్చిన అతను ‘బెంగాల్ టైగర్’, ‘గౌతమ్ నందా’ సినిమాలతో వెనుకబడ్డాడు. ‘సీటీమార్’తో హిట్‌కొట్టి టాప్ స్టార్స్ దృష్టిలో పడాలని అతను ట్రై చేస్తున్నాడు. ఇటు గోపీచంద్‌కీ, అటు సంపత్ నంద్‌కీ కీలకమైన ‘సీటీమార్’ సినిమా చివరకు ఆ ఇద్దరినీ ఏ తీరానికి చేరుస్తుందనే విషయం ఆసక్తికరం.