కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. మరోవైపు లాక్‌డౌన్ విధించడంతో నిరుపేదలు.. మరీ ముఖ్యంగా సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కరోనాపై పోరాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా.. పలువురు క్రీడా, సినిమా, రాజకీయ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఇక టాలీవుడ్ విషయానికొస్తే.. షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌లు లేక అష్టకష్టాలు పడుతున్న సినీ కార్మికులు.. మరోవైపు పేదలను ఆదుకునేందుకు తమవంతుగా నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు పెద్ద మనసుతో సాయం చేయగా.. తాజాగా హీరో గోపీచంద్ కూడా తనవంతుగా పేదలకు సాయం అందించాడు.
ఒకరిద్దరు కాదు.. దాదాపు వెయ్యికి పైగా కుటుంబాలకు ఒకనెలకు సరిపడా నిత్యావసర వస్తువులను ఆయన అందజేశాడు. తన ఇంటి చుట్టూ ఉన్న.. పేద ప్రజల కాలనీకి వెళ్లిన గోపీచంద్ నిత్యావసర సరుకులు ఉండే బ్యాగ్‌ను అందజేసి మంచి మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా గోపిచంద్ సన్నిహితులు పంచుకున్నారు.
మొత్తానికి చూస్తే.. దాదాపు టాలీవుడ్ నటీనటులంతా తమకు తోచినంత విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. ఆ కోవలోకే గోపీచంద్ కూడా చేరాడన్న మాట. డబ్బులు ఇవాళపోతే రేపొస్తాయి.. సాయం చేస్తే తప్పేముంది.. ఇంకా టాలీవుడ్ ప్రముఖులు పేదలకు సాయం చేయాల్సింది చాలానే ఉంది.. ఆలస్యమెందుకు.. కమాన్.. వచ్చి సాయం చేయండి..!