మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన ‘లూసిఫర్’ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనేసిన సంగతి తెలిసిందే. మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. దీంతో మెగాస్టార్‌ను పెట్టి ఈ సినిమాను రీమేక్ చేయాలని చెర్రీ భావించి హక్కులు కొనేశాడు. వాస్తవానికి కొరటాల శివతో తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ కంటే ముందే సినిమా పట్టాలెక్కాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు.
హీరో ఎవరో తెలిసిపోయింది..? నిర్మాత కూడా చెర్రీనే అని తెలిసిపోయింది.. ఇక మిగిలిందల్లా ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారన్నేదే. అయితే.. మొదట సుకుమార్ అని ఆ తర్వాత శ్రీను వైట్ల.. అబ్బే వీరెవ్వరూ కాదు వివి. వినాయక్ దగ్గరికొచ్చి రీమేక్ ఆగిందని ఇలా చాలా మంది పేర్లే వినిపించాయి. అయితే.. అసలు ఈ సినిమా తాను చేస్తున్నానా.. లేదా..? దర్శకుడు ఎవరు..? ఇదే సినిమా పవన్ కల్యాణ్ అడిగితే పరిస్థితేంటి..? అనే ఆసక్తికర విషయాలను ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ పంచుకున్నారు.
క్లారిటీగా చెప్పేసిన చిరు!
‘లూసిఫర్ రీమేక్ సినిమా నేనే చేస్తున్నాను. నా తర్వాతి సినిమా అదే. ఇప్పటికైతే నలుగురైదుగురు దర్శకులు లైన్‌లో ఉన్నారు. చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చెబుతాను’ అని చిరు క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఈ సినిమాలో పవన్ నటిస్తారని.. ఆయనే హీరో అని వార్తలొచ్చాయ్ కదా..? అనే ప్రశ్నకు చాలా లాజిక్‌గా చిరు సమాధానమిచ్చారు. ‘ఆ సినిమా నేనే చేస్తాను. పవన్ చేస్తానన్నట్లు నాకు ఇంతవరకూ తెలియదు.. నా దాకా ఆ విషయం రాలేదు. ఒకవేళ తమ్ముడు చేయాలని ఉత్సాహపడితే మాత్రం తప్పకుండా ఇచ్చేస్తాను’ అని మెగాస్టార్ చెప్పేశారు. అయితే.. ప్రస్తుతం పవన్ చేతినిండా సినిమాలు బోలెడన్ని ఉన్నాయ్.. మరోవైపు దర్శకులు కూడా క్యూ కడుతున్నారు. ఇప్పట్లో రీమేక్ సినిమా అంటే పవన్‌కు కష్టమే.. సో.. ఇది పక్కాగా మెగాస్టార్‌కే అన్న మాట.