కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉండడంతో వలస కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. వారే కాదు రోడ్డు మీదే జీవితాన్ని వెళ్లదేసే వాళ్లు, ముఖ్యంగా వృద్ధుల దుస్థితి వర్ణనాతీతం.. తలదాచుకోవడానికి ఇళ్ళులేక, యాచక వృత్తి చేద్దామంటే రోడ్డు మీద జనాలు లేక అవస్థలు పడుతున్నారు. కరోనాని ఎదిరించడానికి ప్రభుత్వం చేస్తున్న సమరానికి సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు సాయం అందిస్తున్నారు.
బాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా కరోనా క్రైసిస్ లో సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా షారుక్ ఖాన్ అందరికంటే వినూత్న రీతిలో స్పందించాడు. ఏ దిక్కులేని పిల్లల్ని, వృద్ధులని చేరదీసి తన ఆఫీస్ నే క్వారంటైన్ హోమ్ గా మార్చాడు. కరోనా కారణంగా తమ ప్రాణాలని ఎలా కాపాడుకోవాలో తెలియక ఛస్తూ బ్రతుకుతున్న వారికి ఆశ్రయమిచ్చాడు. ఇందుకోసం తన ఆఫీస్ రెడ్ చిల్లీస్ సంస్థ బిల్డింగ్ ని క్వారంటైన్ హోమ్ గా మార్చేశాడు.
ఇదే కాదు కరోనాపై అలుపెరగకుండా పనిచేస్తున్న వైద్యసిబ్బంది ప్రాణాలకి రక్షణ కల్పించడానికి వారికి కావాల్సిన మాస్కులు, ఇంకా ప్రత్యేక సూట్ల కోసం డబ్బులు ఇచ్చాడట. మొత్తానికి షారుక్ ఖాన్ స్పందించిన తీరుపై ఆయనపై సొషల్ మిడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.