ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టి ఉన్న చిత్రాల్లో పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ మూవీ ఒకటి. ఎప్పుడైతే విజయ్ దేవరకొండతో పూరి సినిమా స్టార్ట్ చేశాడో అప్పట్నుంచీ ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. లేటెస్ట్‌గా ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో తన సత్తాను చాటుకున్న ఏస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇప్పుడు విజయ్‌ను ఏవిధంగా చూపిస్తాడనే ఆసక్తి సాధారణంగానే అందరిలో ఉంది. ‘పోకిరి’ నుంచి ‘టెంపర్’ వరకు పూరి కెరీర్ టాప్ రేంజిలో నడిచింది. ఆ తర్వాత లోఫర్, ఇజం, రోగ్, పైసా వసూల్ సినిమాలతో కెరీర్ డల్ అవడంతో, కసితో రామ్‌ను ‘ఇస్మార్ట్ శంకర్’గా చూపిస్తూ తనలో మునుపటి వాడి, వేడి తగ్గలేదని ఆయన నిరూపించాడు.
మరోవైపు విజయ్ దేవరకొండ పరిస్థితి అంత సవ్యంగా నడవడం లేదు. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం సినిమాల తర్వాత అతను చేసిన సినిమాలు అభిమానుల్ని నిరాశపరిచాయి. ‘టాక్సీవాలా’ హిట్టనిపించుకున్నా, ‘గీత గోవిందం’ హిట్ రేంజిలో దాని రేంజి సగం కూడా లేదు. పైగా ఆ సినిమాలో ఫ్యాన్స్ ఆశించిన హీరోయిజంతో అతను కనిపించలేదు. ద్విభాషా చిత్రం ‘నోటా’ డిజాస్టర్ కాగా, ఎన్నో ఆశలు రేపిన ‘డియర్ కామ్రేడ్’ సైతం చివరి నిమిషంలో ఉసూరు మనిపించింది. ఇక లేటెస్ట్ ఫిల్మ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మరో డిజాస్టర్‌గా చేదు అనుభవాన్ని మిగిల్చింది. అందుకే ఇప్పుడు పూరి డైరెక్షన్‌లో అతను చేస్తున్న సినిమాకు ప్రాధాన్యం ఏర్పడింది.
సాధారణంగా పూరి తన సినిమా పబ్లిసిటీని చక్కగా డిజైన్ చేసుకుంటాడు. పోస్టర్లు, మీడియాకు రిలీజ్ చేసే ఫొటోలను సైతం దగ్గరుండి సెలక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆయనకు చార్మి కూడా తోడయ్యింది. విజయ్ కూడా అంతే. ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలు తెచ్చిపెట్టిన స్టార్ స్టేటస్‌తో తన సినిమాలకు సంబంధించిన ప్రతి విషయం తన కనుసన్నల్లో ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. అందుకే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఆ సినిమా నిర్మాత కె.ఎస్. రామారావు అంతటాయన ‘ఈ సినిమాకు డైరెక్టర్ క్రాంతిమాధవ్ అయినా, ప్రతి విషయం దగ్గరుండి విజయ్ దేవరకొండ చూసుకుంటున్నాడు’ అని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో యాక్టింగ్ కాకుండా మిగతా విషయాల్లో విజయ్ తలదూరిస్తే పూరి, చార్మి ఊరుకుంటారా? అని వారి గురించి తెలిసినవాళ్లు అనుకుంటున్నారు.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ నీడలు ఈ సినిమాపై పడకుండా జాగ్రత్తలు తీసుకొని, బ్లాక్‌బస్టర్ కొట్టాలని విజయ్ కసరత్తు చేస్తున్నాడు. బాక్సర్‌గా కనిపించడం కోసం కండలు పెంచిన అతడు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకూడదని భావిస్తున్నాడు. ఈ సినిమా హిట్టయితే క్రెడిట్ అంతా విజయ్‌కే అతని ఫ్యాన్స్ ఆపాదిస్తారని పూరికి తెలుసు. ఒకవేళ సినిమా సరిగా ఆడకపోతే ఆ భారాన్ని తనే మోయాల్సి ఉంటుందని కూడా ఆయనకు తెలుసు. అయితే పాన్ ఇండియా మూవీగా తయారవుతున్న ఈ సినిమాతో వరుసగా సెకండ్ బ్లాక్‌బస్టర్ కొట్టడం ద్వారా టాప్ స్టార్స్‌కు ఒక మెసేజ్ ఇవ్వాలనే కృత నిశ్చయంతో పూరి ఉన్నాడు. అందుకే విజయ్‌ను యాక్టింగ్ మినహా మిగతా విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లూ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.