కరోనా మహ్మమ్మారి ప్రపంచాన్ని కాటేస్తుండటంతో.. దానిపై యుద్ధం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, క్రీడా, రాజకీయ ప్రముఖులు.. మరీముఖ్యంగా టాలీవుడ్ నటీనటులు, దర్శకనిర్మాతలు తమవంతుగా విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకుంటున్నారు. టాలీవుడ్‌లో షూటింగ్స్, సినిమా రిలీజ్‌లు ఇలా సర్వం ఆగిపోయినప్పటికీ తమను ఆదరించి ఈ స్థాయికి చేర్చిన తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం కష్టమైనా సరే కచ్చితంగా సాయం చేయాలని భావించి ముందుకొచ్చారు. మరోవైపు.. సినిమానే నమ్ముకున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో వారికోసం చారిటీ కూడా స్థాపించి.. విరాళాలు సేకరించి సాయం చేస్తున్నారు. ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. అటు చారిటీకి కూడా విరాళాలు ప్రకటించిన వారున్నారు.
ఒకసారి ఆలోచించండి సార్లూ..!
అయితే ఇంత చేస్తున్నా తెలుగు రాష్ట్రాల సీఎంల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు.. స్పందన అనడం కంటే గుర్తించలేదంటే కరెక్టేమో..!. పైగా.. ప్రెస్‌మీట్‌లు పెట్టి కరోనా గురించి గట్టిగానే మాట్లాడుతున్న ముఖ్యమంత్రులు విరాళాలు గురించి అస్సలే మాట్లాడకపోవడం బాధాకరం. ఎస్.. విరాళాలు ప్రకటించిన వారందరికీ ధన్యవాదాలు.. అని ఒక్క మాట అని ఉంటే.. దాతలకు ఎంత కిక్ వచ్చేదో ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రులూ..!. వాస్తవానికి చేసిన సాయం గురించి చెప్పుకోకూడదులే కానీ.. కాస్తో కూస్తో విరాళాలు ఇచ్చిన వారికి ఫీలింగ్ అనేది ఉంటుందిగా..!. ఒకవేళ మీడియా ముందు చెప్పలేకపోతే సోషల్ మీడియా ద్వారా అయినా కనీసం ట్వీట్ అయినా చేస్తే మంచిదేమో సార్లూ.. జర ఆలోచించండి..!
ఇస్తార్లేండి.. స్పందించండి!
ఇదిలా ఉంటే.. టాలీవుడ్ నుంచి నటీనటులు పెద్ద ఎత్తున కోట్లల్లో విరాళాలు ప్రకటించారు కానీ.. ఇంకా ముఖ్యమంత్రుల సహాయనిధికి అందలేదని.. అందుకే వారిని ప్రశంసించలేదేమో అనే టాక్ కూడా నడుస్తోంది. ప్రకటించిన తర్వాత కచ్చితంగా ఇస్తారు.. ఎందుకంటే ప్రకటించి ఇవ్వకుండా పరువు పోగొట్టుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదుగా.. సో.. టాలీవుడ్ సాయాన్ని ఇప్పటి వరకూ గుర్తించకపోయినా.. ఇక ముందైనా స్పందిస్తే మంచిదేమో ముఖ్యమంత్రులూ..!. ఎందుకంటే.. పీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రకటించిన వారిని ఏకంగా ప్రధాని మోదీనే సందర్భాలున్నాయ్.. దీంతో దాతల్లో ఒకింత కొత్త ఊపు అనేది వస్తుంది.. రేపొద్దున ఇంతకంటే ఘోర పరిస్థితి వచ్చినప్పుడు ముందుకొచ్చి సాయం చేస్తారు కదా.. జర ఆలోచించండి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులారా..!?