‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ టీజర్ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఒక్క తెలుగులోనే కాదు, హిందీలోనూ అదే రేంజిలో దానికి రెస్పాన్స్ వచ్చింది. అంతేనా.. తమిళ, కన్నడ వెర్షన్ల టీజర్లకూ చెప్పుకోదగ్గ వ్యూస్ వచ్చాయి. ఆ టీజర్‌లో సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించిన విధానం ఆడియెన్స్‌కు ఎంతగా నచ్చిందో, ఆ క్యారెక్టర్‌ను కొమరం భీమ్ పాత్రధారి జూనియర్ ఎన్టీఆర్ పరిచయం చేసిన విధానం అంతగానూ నచ్చింది. గంభీరమైన వాయిస్‌తో రామరాజు పాత్రను తారక్ ఇంట్రడ్యూస్ చేస్తుంటే, మనకు గూస్‌బంప్స్ వచ్చాయనేది నిజం. అంత బాగా తన వాయిస్‌తో తారక్ ఆకట్టుకున్నాడు. హిందీ వెర్షన్‌కు సైతం తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ సూపర్బ్‌గా ఉందని బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సైతం మెచ్చుకున్నాడంటే.. ఆ వాయిస్ హిందీవాళ్లనూ ఎంతగా ఆకట్టుకుందో ఊహించుకోవచ్చు.
ఇవాళ టాలీవుడ్‌లో భారీ డైలాగ్స్‌ను గుక్క తిప్పుకోకుండా చెప్పగల యంగ్ స్టార్స్‌లో తారక్‌ను మించినవాడు లేడని ఎవరైనా అంగీకరిస్తారు. ఒక యాక్టర్‌గా తారక్ బలాల్లో ప్రధానమైంది.. అతని డైలాగ్ డెలివరీయే. పౌరాణిక డైలాగులు చెప్పాలన్నా, హై పిచ్‌తో ఆవేశభరితమైన సంభాషణలు చెప్పాలన్నా తారక్ తర్వాతే ఎవరైనా. అందుకే అతని వాయిస్ ఇప్పుడు తెలుగు ప్రాంతాన్ని దాటి తమిళ, కన్నడ, హిందీ సీమల వారినీ అలరిస్తోంది. దీంతో ఇప్పుడు తారక్‌తో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తయారవనున్న సినిమా సమీకరణాలు మారుతున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి కల్యాణ్‌రామ్‌కు చెందిన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
‘రౌద్రం రణం రుధిరం’ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే తారక్-త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటివరకూ తారక్ కానీ, త్రివిక్రమ్ కానీ పాన్ ఇండియా సినిమా చెయ్యలేదు. ఇప్పుడు తాజా సినిమాను పాన్ ఇండియా లెవల్లో తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. తారక్ వాయిస్‌ను అన్ని భాషలవాళ్లూ ఇష్టపడుతున్న సందర్భంలో పాన్ ఇండియా సినిమా చేస్తే మరింత లాభసాటిగా ఉంటుందని నిర్మాతలు కూడా త్రివిక్రమ్‌తో చెబుతున్నారనీ, దీనికి ఆయన కూడా సరేనన్నారనీ అంతర్గత వర్గాలు అంటున్నాయి. అంటే.. ఒకే ఒక్క టీజర్‌తో తారక్ పేరు టాలీవుడ్‌ను దాటిందన్న మాట. చూద్దాం.. తారక్-త్రివిక్రమ్ సినిమాని ఏం రేంజిలో నిర్మిస్తారో?!