‘మనకోసం నిలబడే వారికోసం కోసం మనం నిలబడుదామంటూ’ సినీ కార్మికులకి 2 లక్షల విరాళమిచ్చిన హీరో కార్తికేయ
కరోనా వ్యాప్తి భయం కారణంగా షూటింగ్‌లు లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ’ (సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేస్తూ సినీ కళాకారులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని, ‘కరోనా క్రైసిస్ చారిటీ’ చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ఆయన పిలుపుకి మద్దతుగా నిలబడిన ఎంతో మంది తారలతో పాటు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ రూ. 2 లక్షలు విరాళం ప్రకటించారు.
ఈ సందర్భంగా.. ‘‘షూటింగుల్లో భాగంగా సెట్ లో ఎంతో కష్టపడే కార్మికులకు ఇలాంటి ఆపద సమయంలో తోడుగా ఉండడం, వీలైనంత సహాయం చేయడం మన బాధ్యత. రోజంతా మనకోసం నిలబడే వారికోసం మనమిప్పుడు నిలబడదాం. అలాగే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వారు అమలుపరుస్తున్న నియమాలని పాటిద్దాం, కలిసికట్టుగా ఒకే మాట మీదుండి అందరూ విడివిడిగా ఇంటిపట్టునే సురక్షితంగా ఉంటూ సంతోషంగా ఉందాం’’ అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.
సినీ కార్మికులకు నా విరాళం రూ. 5 లక్షలు.. సమష్టిగా ఈ సంక్షోభ కాలాన్ని ఎదుర్కొందాం: విష్వక్‌సేన్
ఈ సంక్షోభ సమయంలో అందరూ సురక్షితంగా ఉంటారనీ, మీ గురించి మీరు శ్రద్ధ వహిస్తారనీ ఆశిస్తున్నా. కోవిడ్-19 వ్యాప్తిని అదుపు చేయడానికి మనదేశం అత్యంత ముఖ్యదశలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో, అహర్నిశలూ ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తూ వస్తోన్న వైద్య సిబ్బందికీ, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కూ, ఈ క్లిష్ట కాలంలో తమ వంతు సేవలు అందిస్తూ వస్తోన్న ప్రతి వ్యక్తికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ ఆరోగ్యం కంటే దేశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న మీకు తగినవిధంగా కృతజ్ఞతలు చెప్పుకోగలనని నేను అనుకోవట్లేదు.
ఈ లాక్‌డౌన్ సమయంలో నేను నా బాల్కనీలో నిల్చొని ఖాళీగా ఉన్న రోడ్లను చూస్తున్నప్పుడల్లా, వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొంటే బాగుండుననే ఫీలింగ్ నిరంతరం కలుగుతోంది. కానీ దానికి కొంత సమయం పడుతుందని నాకు తెలుసు. ఇది కష్ట కాలమని నేను అర్థం చేసుకున్నాను. ఈ సందర్భంలో మనమంతా మనుషులుగా మన బలాన్నీ, బాధ్యతాయుత ప్రవర్తననూ, కామన్ సెన్స్‌నూ, కరుణనూ సమష్టిగా ప్రదర్శించాలని అవగతం చేసుకున్నాను. ఈ పరిస్థితిలోని సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకొని, అవసరమైనంత కాలం ఒకరికొకరం సామాజిక దూరం పాటించడం చాలా కీలకం.
అంతే కాకుండా, ఒకరికొకరం.. అది చిన్నదైనా సరే.. సాధ్యమైనంత వరకు సాయం చేసుకోవాలి, మానవజాతిగా ఐక్యంగా ముందుకు సాగాలి. నా వంతుగా.. ఈ మహమ్మారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న, ఆసరా కోసం ఎదురుచూస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమలోని కార్మికులకు రూ. 5 లక్షలు విరాళంగా అందజేస్తున్నాను.
ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను దయచేసి పాటించాలని ప్రతి ఒక్కరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రానున్న కొద్ది వారాలు మన దృష్టి పూర్తిగా సామాజిక దూరంపై కేంద్రీకరించాలి. మన ఆరోగ్యపరిరక్షణ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడీ లేకుండా చూసుకోవాలి. చివరగా ఈ మహమ్మారిపై విజయం సాధించాలి. శక్తిమంతంగా ఉండండి. ప్రేమతో...
మీ
విష్వక్‌సేన్