కరోనా ప్రభావం వల్ల దేశం మొత్తం లాక్ డౌన్లో ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో కరోనాపై యుద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి తమవంతు సాయంగా ఒక్కొక్కరు సాయం చేస్తున్నారు. టాలీవుడ్ లో అయితే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ముందుకు వచ్చారు. ప్రభాస్ నాలుగు కోట్లు ప్రకటించి నేషనల్ స్టార్ అని నిరూపించుకున్నాడు. అయితే దక్షిణాది నుండి ముఖ్యంగా తెలుగు పరిశ్రమ నుండి పీఎమ్ రిలీఫ్ ఫండ్ కి విరాళాలు వెల్లువలా ప్రకటిస్తుంటే బాలీవుడ్ సెలెబ్రిటీలు మాత్రం తమకేం పట్టనట్లుగా ఉండిపోయారు.
బాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది. అక్కడ హీరోల రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. తమ సినిమా రిలీజ్ అయినపుడు ప్రమోషన్స్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టే హీరోలు ఇలాంటి టైమ్ లో ఎవరూ ముందుకు రాకపోవడంతో సోషల్ మీడియాలో అనేక విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు వెల్లువెత్తుతుండగానే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన సాయాన్ని ప్రకటించాడు. కరోనా క్రైసిస్ ని ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వానికి హెల్ప్ చేయడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించాడు.
ఈ సంవత్సరం బాలీవుడ్ హీరోల్లో ఎక్కువ సినిమాల్లో నటించడమే కాకుండా ఆ సినిమాల ద్వారా దాదాపు ఏడు వందల కోట్ల వ్యాపారాన్ని సృష్టించాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.