కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు దాదాపు షట్ డౌన్ అయ్యాయి. ఇప్పటికే థియేటర్స్, సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసుకోవడం జరిగింది. మరోవైపు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంటే.. ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ ఉండనుంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సినిమా సెలబ్రిటీలు తమవంతుగా జనాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇప్పటికే.. సూపర్ స్టార్ మహేశ్ తమ అభిమానులు, యావత్ ప్రజానికానికి పలు జాగ్రత్తలు చెప్పిన ఆయన.. ఉగాది సందర్భంగా తాజాగా మరో ఆరు గోల్డెన్ రూల్స్ చెప్పిన విషయం విదితమే.
మొన్న మహేశ్.. నేడు సితార!
అయితే.. తాజాగా సూపర్ స్టార్ కుమార్తె సితార కూడా కరోనా కట్టడి చేయడానికి ప్రజలకు తన వంతుగా వీడియో రూపంలో పలు టిప్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతేకాదు.. సోషల్ మీడియాలోను ట్రెండింగ్‌లో ఉంది. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సితార ఏమేం సలహాలు ఇచ్చింది..? జనాల్లో అవగాహన పెంచేందుకు ఏమేం చెప్పింది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సితార టిప్స్..
‘కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండండి. మేము కూడా సేఫ్‌గా ఇంట్లోనే ఉన్నాం. బయటికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి. జ్వరం, పొడి దగ్గు, మోషన్స్, జలుబు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. ఇంట్లో ఉన్నా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి. అలాగే శానిటైజర్‌తో 22 సెకండ్లపాటు చేతులను కడుక్కోవాలి. ఏ వస్తువును ముట్టుకున్నా లేక ఇంట్లో ఏ వర్క్ చేసిన తర్వాత ఖచ్చితంగా మోచేతుల వరకూ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. అలాగే మీరు దగ్గినా, తుమ్మినా, అరిచేతుల్లోకి కాకుండా మోచేతిని అడ్డం పెట్టుకోండి. దయచేసి చేతులతో మీ ముఖాన్ని, కళ్లను, పెదాలను ముట్టుకోకండి. ప్లీజ్ ఇంట్లోనే ఉంటూ.. కరోనాతో ఫైట్ చేద్దాం’ అని ముద్దు ముద్దుగా సితార వీడియోలో చెప్పింది. ఈ వీడియోను నెటిజన్లు, ముఖ్యంగా మహేశ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.