సాధారణంగా కొత్త హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ డబ్బులు సినిమాపై పెట్టరు. కొత్తగా పరిచయమయ్యే హీరోకి మార్కెట్ అంతగా ఉండదు కాబట్టి ఎక్కువ రిస్క్ చేయాలని అనుకోరు. కానీ సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన చిత్రానికి ఆ రిస్క్ చేస్తున్నారు నిర్మాతలు. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నుండి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేశారు. నీ కన్ను నీలి సముద్రం, ధక్ ధక్ ధక్ అంటూ సాగిన ఈ పాటలు చాలా వైరల్ అయ్యాయి. ఈ పాటలతో సినిమా పట్ల ఓ పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. కానీ ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా లేదో తెలియదు. కానీ నిర్మాతలకి మాత్రం ఈ సినిమాపై బాగా నమ్మకం ఉందట.
అందుకే మామూలుగా పెట్టేదాని కంటే ఎక్కువ డబ్బునే ఈ చిత్రం కోసం పెట్టారట. అసలు ఇప్పటి వరకు సినిమాలే చేయని ఒక హీరోకి ఆ మాత్రం డబ్బులు పెట్టడానికి సంకోచించే అంతటి బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. అంతటి బడ్జెట్ లో ఓ మిడ్ రేంజ్ హీరో సినిమా తీసేయొచ్చట. మరి నిర్మాతలు వైష్ణవ్ ని నమ్ముతున్నారా... లేదా దర్శకుడిని నమ్ముతున్నారా అంటే ఖచ్చితంగా దర్శకుడినే అని తెలుస్తుంది. మరి ఆ దర్శకుడు మైత్రీ నిర్మాతల నమ్మకాన్ని నిలబెడతాడో లేదో చూడాలి.