ఇప్పట్లో సినిమాలు చేయననీ, రాజకీయాలకే అంకితమనీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించినప్పుడు ఆయన ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. రెండేళ్లు తిరగకముందే మళ్లీ సినిమాలు చేస్తున్నాననీ, జనసేన పార్టీని నడపాలంటే తనకు నటించడం తప్ప వేరే మార్గం లేదనీ ఆయన చెప్పినప్పుడు మిగతావాళ్లు ఏమనుకున్నా ఫ్యాన్స్ అయితే సంబరపడ్డారు. పవర్ స్టార్ ఏకంగా మూడు సినిమాలు కమిట్ అయి వాళ్లకు మరింత ఆనందం చేకూర్చారు. ఇప్పటికే శ్రీరామ్ వేణు డైరెక్షన్‌లో చేస్తోన్న ‘వకీల్ సాబ్’, క్రిష్ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉన్నాయి. క్రిష్‌తో చేస్తున్న సినిమా ముగింపు దశకు వచ్చే సమయానికి హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో సినిమాని పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు.
కాగా ఇప్పుడు ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసే విషయం ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అది.. పీకే డబుల్ రోల్ చేస్తున్నాడనే విషయం. అవును. ‘తీన్ మార్’ (2011) తర్వాత ఆయన మరోసారి ద్విపాత్రల్లో కనిపించనున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో ఆయన బందిపోటుగా నటిస్తున్నాడనే విషయం ఇప్పటికే లీక్ అయింది. స్వాతంత్ర్య పూర్వ కాలానికి సంబంధించిన స్టోరీతో పీరియడ్ ఫిల్మ్‌గా తయారవుతున్న ఇందులో పీకే మరో పవర్‌ఫుల్ రోల్ కూడా చేస్తున్నారని తాజాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ విషయంలో ప్రస్తుతానికి సినిమా యూనిట్ గుంభనంగా వ్యవహరిస్తోంది.
హిందీ హిట్ ఫిల్మ్ ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్‌గా జయంత్ సి. పరాన్జీ డైరెక్ట్ చేసిన ‘తీన్‌మార్’ సినిమాలో పవన్ కల్యాణ్ రెండు కాలాలకు చెందిన పాత్రల్ని పోషించారు. వాటిలో ఒకటి 1980ల కాలానికి చెందిన అర్జున్ పాల్వాయ్ పాత్ర కాగా, మరొకటి 2010 కాలానికి చెందిన మైఖేల్ వేలాయుధం క్యారెక్టర్. తెరపై ఈ రెండు పాత్రలు ఎప్పుడూ కలుసుకోవు. ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ఇప్పుడు క్రిష్ డైరెక్షన్‌లో చేస్తోన్న సినిమాలో పవన్ కల్యాణ్ డ్యూయల్ రోల్ చేస్తోంది నిజమే అయితే.. ఈసారి ఆయన ఆడియెన్స్‌ను అలరిస్తారని ఆశించవచ్చు.