కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోతోంది. చైనాలో రోజురోజుకూ కొత్త వైరస్‌లు పుడుతుండటం.. మరోవైపు ఇటలీలో మరణాల సంఖ్య పెరిగిపోయి శవాల దిబ్బగా మారడంతో అక్కడున్న జనాలు.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు భయంతో వణికిపోతున్నారు. అసలు ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇళ్లలో నుంచి రాకుండా ఉండలేక.. వస్తే ఎక్కడ వైరస్ సోకుతుందో అని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికేస్తున్నారు. అయితే తాను అనుభవిస్తున్న నరకాన్ని ఓ వీడియో ద్వారా టాలీవుడ్ లేడీ సింగర్ తెలియజేసింది.
ఆ సింగర్ ఎవరబ్బా అని సందేహం కలుగుతోంది కదూ.. ఆమే శ్వేతా పండిట్. పేరు గుర్తుగా రావట్లేదా.. ‘కొత్త బంగారు లోకం’ మూవీలో ‘నేనని నీవని’.. సైజు జీరో సినిమాలో ‘మెల్ల మెల్ల’.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సమంత సోలో సాంగ్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘మహానుభావుడు’, ‘ఓం నమో వెంకటేశయ:’, ‘ముకుంద’,‘దమ్ము’ ఇలా చెప్పుకుంటూ పెద్ద లిస్టే ఉంది. తెలుగుతో పాటు బాలీవుడ్ తన గాత్రాన్ని వినిపించింది. పద్మ విభూషణ్ పండి జస్రాజ్ మేనకోడలే శ్వేతా. అలా తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటలీలో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె ఇటలీలో ఉంటోంది.
ఇటలీలో పరిస్థితి ఎలా ఉందంటే..!
ఇటలీలో పరిస్థితి ఎలా ఉంది..? నిద్ర లేచింది మొదలుకుని పడుకునే వరకూ ఏమేం చేస్తోంది..? అసలు ఇటలీలో వాస్తవిక పరిస్థితులేంటి..? అనే విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో నిశితంగా వివరించింది. ‘ప్రపంచాన్ని కరోనావైరస్ ఎంత దారుణమైన పరిస్థితులను కల్పించిందో అందరికీ తెలిసిందే. భారత్‌లో కూడా లాక్‌డౌన్ కొనసాగుతోందని నాకు తెలిసింది. ఇటలీలోని పరిస్థితులు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రపంచంలో భారీగా ఎఫెక్ట్ అయిన దేశంగా ఇటలీ మొదటి స్థానంలో ఉంది. ప్రతీ రోజు ఉదయమే అంబులెన్స్‌ల సైరన్లతో నిద్రలేస్తున్నా. కళ్లేదుటే మరణాలు.. ఇదంతా వాస్తవం. నా ఆరోగ్యం గురించి పలు దేశాల నుంచి కాల్ చేసి వాకబు చేస్తున్నారు. నా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల ప్రేమ వల్లనే నేను సేఫ్‌గానే ఉన్నాను’ అని శ్వేతా చెప్పుుకొచ్చింది.
ఇలా చేయండి..!
అంతేకాదు.. చివర్లో కొన్ని జాగ్రత్తలు సైతం చెప్పింది. కరోనా తుద ముట్టించేందుకు ప్రతి ఒక్కరు వీర సైనికుల్లా పూనుకోవాలని పిలుపునిచ్చింది. ప్రాణాంతక వ్యాధిని మనమంతా ఓడించాలంటే.. ఇంటి వద్దనే ఉండాలని చెప్పింది. దీంతో పాటు ప్రతి ఒక్కరూ చేతులను జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలని.. దూరంగా ఉంటి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని సూచించింది. ఫ్రెండ్స్‌ను మిస్సవుతున్నాం అనుకుంటే వారితో వీడియో కాల్‌లో మాట్లాడాలని సూచించింది. పాటలు వింటూ, సినిమాలు చూస్తూ ఆనందంగా వినోదం పొందాలని శ్వేతా పండిట్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూచించింది.